ఏ ఎన్నికలు వచ్చినా… పోల్ మేనేజ్మెంట్ లో అధికార పార్టీ తెరాసకు తిరుగులేదు! ఏ గుమ్మం ముందు ఆ పాట పాడినట్టుగా, ఒక్కో స్థాయి ఎన్నికలకు ఒక్కోరకమైన వ్యూహాన్ని అనుసరించి, చివరికి గెలుపును సొంతం చేసుకుంటున్నారు. తాజాగా జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ఎలాంటి వ్యూహాలను అనుసరించిందో చూశాం. ఇక, ఇప్పుడు తెరాస దృష్టి రాబోయే మున్సిపల్ ఎన్నికల మీద పడింది. వరుసగా గెలుస్తున్నాం కాదా… దీన్లోనూ తిరుగుండదు అనే ధీమా పార్టీ శ్రేణులకు ఏమాత్రం కలుగకుండా చూసుకుంటూ వస్తున్నారు మంత్రి కేటీఆర్..! హుజూర్ నగర్ ఉప ఎన్నిక సమయంలో పార్టీ శ్రేణులకు ఎలాంటి మోటివేషన్ ఇచ్చారో… ఇప్పుడే అదే తరహాలో మళ్లీ నేతలకు క్లాసులు తీసుకోవడం మొదలుపెట్టేశారు కేటీఆర్.
తెలంగాణ భవన్ లో నేతలతో కేటీఆర్ మాట్లాడుతూ… నెలలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్నారు. సాధారణ ఎన్నికలకు భిన్నంగా మున్సిపల్ ఎన్నికలుంటాయనీ, కాబట్టి నాయకులెవ్వరూ ఆషామాషీగా వ్యవహరించడానికి వీల్లేదన్నారు. ఏమాత్రం అలసత్వం వహించినా మొత్తానికే ఎసరొస్తుందని గుర్తుంచుకోవాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీని గెలిపించాల్సిన బాధ్యత పూర్తిగా ఎమ్మెల్యేలపైన ఉంటుందన్నారు. ఎంపీ ఎన్నికల్లో భాజపాకి గాలివాటంగా ఓ నాలుగు సీట్లు వచ్చేశాయనీ, హుజూర్ నగర్ కి వచ్చేసరికి కనీసం డిపాజిట్లు కూడా వారికి రాలేదన్నారు. అయితే, మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని చోట్లు కాంగ్రెస్ తో భాజపా కలిసి పనిచేసే అవకాశం ఉందనీ, కాబట్టి దానికి తగ్గట్టుగా మన వ్యూహాలు ఉండాలన్నారు కేటీఆర్.
భాజపా పేరుతో పార్టీ శ్రేణుల్ని కేటీఆర్ బాగానే అప్రమత్తం చేస్తున్నారు! నిజానికి, కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షమే అయినా… గట్టి పోటీ వారు ఇవ్వలేరులే అనే ధీమా తెరాసలోని అన్ని శ్రేణుల నాయకులకీ ఉంది. అందుకే, ఆ పార్టీ ప్రస్థావనను ప్రధానంగా కేటీఆర్ తీసుకుని రావడం లేదు! కానీ, భాజపా విషయంలో కొంత పక్కబెదురు అందరికీ ఉంటూ వస్తోంది. అందుకే ఆ పార్టీ పేరుతో నాయకుల్ని మోటివేట్ చేస్తున్నారు. నిజానికి, భాజపా కేంద్రంలో అధికారంలో ఉంది. అర్బన్ ప్రాంతాల్లో కొంతమంది ఆపార్టీకి ఆకర్షితులయ్యే అవకాశం ఈ ఎన్నికల్లో లేకపోలేదు. ఆ పార్టీ కూడా మున్సిపోల్స్ మీదే దృష్టంతా పెట్టుకుని ఉంది. కాబట్టి, కేటీఆర్ చెబుతున్నట్టుగా ఈ ఎన్నికలు గతం కంటే కాస్త భిన్నమైనవే. ఈ నేపథ్యంలో కొత్త వ్యూహాలేలా ఉంటాయో చూడాలి.