బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాటల్లో ఉండే దూకుడు విమర్శకులకు కూడా నచ్చుతోంది. గిల్లి జోలపాడటం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య. ఖమ్మంలో మిర్చి రైతులకు తను సీఎంగా ఉన్నప్పుడే బేడీలు వేసారు. ఈ విషయంపై దేశ వ్యాప్త చర్చకు దారి తీసింది. కాని ఓ మీడియా సమావేశంలో “రైతులకు బేడీలు వేసే మొగోడు ఎవడాయ్” అని మీడియాను ఎదురు ప్రశ్నించారు. ఇలాంటి ప్రసంగాలు కేసీఆర్ నుంచి కోకొల్లలు. కరోనా సమయంలో కేసీఆర్ ప్రసంగాలకు మంచి ఫాలోయింగ్ ఉండేది. ఆయన ఏది మాట్లాడినా “వైరల్” అయ్యేది.
కేసీఆర్ ప్రెస్ మీట్ అంటే చాలు టీవీల్లో మంచి రేటింగ్ ఉండేది. నేషనల్ లెవెల్ లో చూసేవాళ్ళు ట్రోల్ అయిన సందర్భాలు చాలా తక్కువ. అయితే బీఆర్ఎస్ లో ఇప్పుడు భిన్న వాతావరణం ఉంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ట్రోల్ అవుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకప్పుడు కేటిఆర్ ప్రసంగాలు కూడా వైరల్ అయ్యేవి. ట్రోల్ అయిన సందర్భాలు తక్కువే. కానీ అధికారం కోల్పోయామనే బాధనో… తాను కూర్చోవాల్సిన కుర్చీలో తాను కలలో కూడా వ్యతిరేకించే వ్యక్తి కూర్చున్నాడనే అసహనమో గాని… కేటిఆర్ దూకుడు స్వభావం పాళ్ళు కాస్త ఎక్కువయ్యాయి.
మహిళల విషయంలో కాస్త సున్నితంగా వ్యవహరించాలి. ముఖ్యంగా వెనకబడిన వర్గాల మహిళా నేతల విషయంలో. సీఎం రేవంత్ పై ఏ దూకుడు అయితే ప్రదర్శిస్తున్నారో మహిళా నేతల విషయంలో కూడా అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఆయన భావం ఏదైనా జనాల్లోకి మాత్రం నెగటివ్ సంకేతాలు వెళ్తున్నాయి. కేసీఆర్ కు గాని, బీఆర్ఎస్ కు గాని అభిమానులు పెరిగింది ప్రసంగాలతోనే. తెలంగాణా ఉద్యమానికి కేసీఆర్ ఓ ఊపు తెచ్చింది ప్రసంగాలతోనే. ఇప్పుడు అవే ప్రసంగాలు బీఆర్ఎస్ కు మైనస్ అవుతున్నాయి.
హైడ్రా, మూసీ విషయంలో కేటిఆర్ దూకుడు బాగుంది. ఇదే సమయంలో రైతు రుణమాఫీ అంశాన్ని సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఎత్తుకుని దూకుడుగా వెళ్తున్నారు. కాని హరీష్ మాటల్లో దూకుడున్నా దానికి ఓ లిమిట్ పెట్టుకుని మాట్లాడుతున్నారు. కొండా సురేఖపై బీఆర్ఎస్ సోషల్ మీడియా చేసిన పోస్ట్ ల విషయంలో హరీష్ చాలా చాకచక్యంగా మాట్లాడి ఖండించారు. అందులో కచ్చితంగా అనుభవం కనపడుతోంది. కాని కేటిఆర్ విషయంలో అది లోపించింది అనే భావన ఉంది. కొండా సురేఖకు ఆ నొప్పి ఇప్పుడు తెలుస్తుందా అన్నారు.
సురేఖ గతంలో కేటిఆర్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు ఏం చేయలేదు. కాని కేటిఆర్ “నొప్పి” అనే పదం వాడారు. ఇది రామన్న కాస్త గ్రహించాలి. కేటిఆర్ ఏం మాట్లాడినా బీఆర్ఎస్ అభిమానులు, కార్యకర్తలు వైరల్ చేస్తారు. అందులో సందేహం లేదు. కాని బాణాలు తిరిగి కేటిఆర్ కు తగలకుండా ప్రసంగాలు ఉండాలంటే కాస్త దూకుడు తగ్గాలి. మైక్ పట్టుకుంటే ప్రత్యర్ధులు భయపడాలి గాని అభిమానులు కాదు. ప్రతిపక్ష విమర్శలు ప్రజాస్వామ్య దేశాల్లో సహజం. ఆ విమర్శలను కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకోకపోతే… బీఆర్ఎస్ ప్రజల్లో ఇబ్బంది పడవచ్చు. కేటిఆర్ భవిష్యత్తు నేత… ఇప్పటికే కేటిఆర్ కు అహంకారం అనే విమర్శను ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. అది కేటిఆర్ గ్రహించి దూకుడులోనే సౌమ్యం ప్రదర్శించాలి. ఉదాహరణకు తన తండ్రినే కేటిఆర్ తీసుకోవాలి.