తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తుకు వెళ్తారన్న చర్చ కొంత కాలంగా నడుస్తోంది. రాజకీయంగా కేసీఆర్ ఒక్క సారిగా యాక్టివ్ కావడంతో ప్రజలకు ప్రతిపక్షాలకు ఇదే సందేహం వస్తోంది. ఏ రాజకీయ వ్యూహం లేకుండా ఆయన ఇలాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్ వేయరని భావిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుపై మోడీ వ్యాఖ్యల తర్వాత టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగించిందీ.. నేతలు, మంత్రులు కమలదళంపై విమర్శలు గుప్పించిందీ.. రాష్ట్ర ప్రజల్లో మరోసారి సెంటిమెంట్‌ను రగిలింపజేయడానికే.
వచ్చే జూన్ తర్వాత ఏ రోజైనా శాసనసభను రద్దు చేసే అవకాశముందని ఇప్పటికీ అందరూ నమ్ముతున్నారు. నవంబర్, డిసెంబర్లో గుజరాత్ తదితర రాష్ట్రాలతోనో లేదంటే 2023 ఏప్రిల్, మే నెలల్లో కర్ణాటక తదితర రాష్ట్రాలతోనో ఎన్నికలు జరుగవచ్చునని అంచనా వేస్తున్నారు. ఒకవేళ మోడీ సర్కారు సహకరించిన పక్షంలో ఈ ఏడాది జూన్-ఆగస్టు మధ్య ఒక్క తెలంగాణ కోసమే ఎన్నికలు నిర్వహించే అవకాశం కూడా లేకపోలేదన్న అంచనాలు ఉన్నాయి.
టీఆర్ఎస్ సర్కార్‌పై వ్యతిరేకత బహిరంగంగానే కనిపిస్తోంది. దీన్ని అధిగమించాలంటే భావోద్వేగ అంశాన్ని అందుకుని ఎన్నికలకు వెళ్లాలి. అయితే ఈ ముందస్తు ఆలోచనలపై కేటీఆర్ సుముఖంగా లేరని టీఆర్ఎస్లోనే మరో వర్గం బలంగా వాదిస్తోంది. ఏడాది సమయం ఉండి కూడా తప్పుడు అంచనాలతో ముందస్తు ఎన్నికలకు వెళ్లి, అధికారం కోల్పోతే పరువు పోతుందనే అభిప్రాయంతో కేటీఆర్ ఉన్నారు. కేటీఆర్‌ను సీఎం చేసి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని కేటీఆర్ వర్గం కోరుకుంటోంది. ఐదు రాష్ట్రాలఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత కేసీఆర్ తన ముందస్తు నిర్ణయంపై ఓ అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంది.