భారీ లక్ష్యాలతో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అధికార పార్టీ తెరాస చేపడుతున్న సంగతి తెలిసిందే. మున్సిపల్ ఎన్నికలు ముందుండటంతో దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇంకోపక్క, భాజపా కూడా పోటాపోటీ అన్నట్టుగా సభ్యత్వాలపై దృష్టిపెట్టింది. అయితే, తెరాస ఎంత ప్రతిష్టాత్మకం అనుకుంటున్నా… హైదరాబాద్ లో సభ్యత్వాల నమోదు మందకొడిగానే సాగుతోంది. వారు అనుకున్న లక్ష్యంలో యాభై శాతమైనా పూర్తవుతుందా అనే అనుమానం కలుగుతోంది. ఈ పరిస్థితిపై సమీక్షించిన తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ నేతలతో ఆయన కాస్త కటువుగానే మాట్లాడారు.
అంబర్ పేట్, సికింద్రాబాద్ లలో 15 వేలు, సనత్ నగర్ లో 25 వేలు, ముషీరాబాద్ లో 20 వేల సభ్యత్వాలు నమోదయ్యాయని పార్టీ నేతలు కేటీఆర్ కి వివరించారు. కేటీఆర్ స్పందిస్తూ… గ్రేటర్ లో మనం ఇంత వీక్ గా ఉన్నామా, ఒక్కో నియోజక వర్గానికీ 50 వేలు లక్ష్యంగా పెట్టుకుంటే, కనీసం సగమైనా ఇంతవరకూ పూర్తికాకపోతే ఎలా అని నిలదీశారు. ఇలా అయితే పార్టీ అధ్యక్షుడిని తానేం చెప్పుకోవాలన్నారు. మరో పదిరోజులు మాత్రమే సమయం ఉందనీ, ఆలోపుగా నూటికి నూరుశాతం అందరూ లక్ష్యాలను పూర్తిచేయాలనీ, తరువాత తనకి లేనిపోని సాకులు చెప్పొద్దని నేతలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక్క జూబ్లీ హిల్స్ లోనే 50 వేలు పూర్తయ్యాయనీ, మిగతావారు అక్కడి మాదిరిగానే పనిచేయాలని అన్నారు. పాతబస్తీ పరిధిలోని 7 నియోజక వర్గాల్లో ఎక్కడా 5 వేలకు మించి సభ్యత్వాలు నమోదు కాలేదనీ, వాటి గురించి విశ్లేషించడం కూడా అనవసరమని కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు! గ్రేటర్ లో పరిస్థితి బయట తెలిస్తే పరువు పోతుందన్నారు.
హైదరాబాద్ తెరాస శ్రేణుల్లో నాయకుల సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోందన్నది వాస్తవం. నిజానికి, కేటీఆర్ నేరుగా అనలేదుగానీ… ఆయన అసంతృప్తి సీనియర్ల మీదే అనేది అర్థమౌతోంది! పార్టీలో సీనియర్లు, ఎమ్మెల్యేలూ కార్పొరేటర్లతో సమన్వయంతో వ్యవహరించడం లేదనీ, సభ్యత్వ నమోదును సీరియస్ గా తీసుకున్నట్టుగా లేరనే అభిప్రాయం తెరాస వర్గాల్లో ఉంది. నాయకుల్ని నమ్ముకుంటే లాభం లేదని అనుకుంటున్నారేమో… ఈ నెల 6 నుంచి స్వయంగా గ్రేటర్ లోని డివిజన్లలో పర్యటించేందుకు కేటీఆర్ సిద్ధమౌతున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలోనే సభ్యత్వాల సంఖ్య ముందుకెళ్తుందేమో చూడాలి. ఇంకోపక్క, భాజపా కూడా గ్రేటర్లో పెద్ద సంఖ్యలో సభ్యత్వాలు చూపించుకోవాలనే పట్టుదలతో ఉంది. ఏదేమైనా, రాబోయే మున్సిపల్ ఎన్నికలు అధికార పార్టీ తెరాసను కాస్త టెన్షన్ పెట్టివిగానే కనిపిస్తున్నాయి.