బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాను బ్రేక్ తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. వెల్ నెస్ ట్రీట్ మెంట్ కోసం తాను వెళ్తున్నట్లుగా ఆయన ట్వీట్ చేశారు. కేటీఆర్కు అంత అనారోగ్య సమస్యలు లేవు. కానీ ప్రకృతితో సేద దీరేందుకు.. రీచార్జ్ అయ్యేందుకు ఆయన కొంత కాలం ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారని అనుకోవచ్చు.
కేటీఆర్ ఇటీవలి కాలంలో ఎక్కడకు వెళ్లాలన్నా ఆయనపై అరెస్టును తప్పించుకునేందుకు పారిపోతున్నారన్న ప్రచారం చేస్తున్నారు. ముందస్తుగా నిర్ణయించుకున్న ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు మలేషియా వెళ్లాల్సిన సమయంలో ఆయనను అరెస్టు చేస్తారన్న ప్రచారం ఉద్ధృతంగా జరిగింది. దాంతో తాను పారిపోయానని ప్రచారం చేస్తారన్న ఉద్దేశంతో కేటీఆర్ ఆగిపోయారు. ఇప్పుడు అరెస్టు వార్తలు తేలిపోయాయి. రేవంత్ రెడ్డి కూడా జైలుకెళ్తే సీఎం అవుదామని ఆశపడుతున్నారని సెటైర్లు వేశారు. ఫార్ములా ఈ రేసు స్కాంకు సంబంధించి విచారణ చేసేందుకు గవర్నర్ పర్మిషన్ రాలేదు. ఇస్తారని కేటీఆర్ కూడా అనుకోవడం లేదు.
లగచర్ల దాడి ఘటనలో ఆయనను అరెస్టు చేస్తారని అనుకున్నా. . ఆ కేసును పట్నం నరేందర్ రెడ్డి వద్దనే ఆపేస్తున్నారు. ఇలాంటి సమయంలో కేటీఆర్ కాస్త విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కడికైనా వెళ్లారని అనుకున్నారు. బయలుదేరి వెళ్లిన తర్వాతనే ట్వీట్ పెట్టారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కొద్ది రోజులు అంటే ఎన్ని రోజులో చెప్పలేదు.. ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు కానీ.. ఆయన పూర్తిగా పొలిటికల్ ఫ్రీ టైం గడుపుతారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.