భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ..గత వారం, పది రోజులుగా బయట కనిపించడం లేదు. ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోతే సోషల్ మీడియాలో స్పందించారు..కానీ నివాళి అర్పించేందుకు వెళ్లలేదు. దీంతో ఆయన దేశంలో లేరని తేలిపోయిందని ఇతర పార్టీల నేతలు అంటున్నారు.
కేటీఆర్ కుమారుడు అమెరికాలో చదువుకుంటున్నారు. కుమారుడ్ని చూసేందుకు కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లారని అంటున్నారు. ఫిబ్రవరి 18వ తేదీన హర్వార్డ్ యూనివర్శిటీలో కేటీఆర్ ప్రసంగం ఉంటుందని గతంలో ప్రచారం జరిగింది. ఆ కార్యక్రమం కోసం వెళ్లారని అనుకుంటున్నారు. అయితే అక్కడ ప్రసంగించినట్లుగా ఫోటోలు కానీ వీడియోలు కానీ బయటకు రాలేదు. కానీ ఆయనవిదేశీ పర్యటనలోనే ఉన్నారని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
లోక్ సభ ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న సమయంలో కేటీఆర్ ఇలా రెండు, మూడు వారాల పాటు అందుబాటులో లేకపోవడం ఆ పార్టీ నేతలకు ఇబ్బందికరమే. చావో రేవో అన్నట్లుగా లోక్ సభ ఎన్నికల కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పదేళ్లు అధికారంలో ఉండి.. ఒక్కసారి ఓడిపోగానే.. ఉనికి సమస్య ప్రారంభమైంది. జమిలీ ఎన్నికలు జరిగి ఉంటే.. పరిస్థితి వేరుగా ఉండేది. కానీ జమిలీ వద్దనుకుని గతంలో ఆరు నెలల ముందు ఎన్నికలకు వెళ్లింది కేసీఆరే.. ఇప్పుడా నిర్ణయమే ఇబ్బందికరంగా మారింది.
కేటీఆర్ మరో వారం రోజుల వరకూ విదేశాల్లోనే ఉండే అవకాశం ఉందని.. తన కుమారుడ్ని మరింత ఉన్నతమైన విద్యాసంస్థలో చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు.