తెలంగాణ రాజకీయం మొత్తం ఇప్పుడు హైదరాబాద్ వరద బాధితులకు తెలంగాణ సర్కార్ ఇస్తున్న రూ. పదివేల వరద సాయం చుట్టూ తిరుగుతోంది. తెలంగాణ సర్కార్ ఏకంగా రూ. 550 కోట్లు పంపిణీ చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు మరో రూ. వంద కోట్లను .. మరో లక్ష కుటుంబాలకు పంచుతామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అయితే ఇది ప్రజాధనాన్ని నేరుగా ఓట్ల రాజకీయాలకు వాడుకోవడమేనని.. బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. బీజేపీ నేతల విమర్శల్ని.. కేటీఆర్ అంది పుచ్చుకున్నారు. వరదల్లో తెలంగాణ తీవ్రంగా నష్టపోతే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రూపాయి సాయం చేయలేదని మండిపడుతున్నారు. తాను లేఖలు రాసి చాలా కాలం అవుతున్నా.. కేంద్రం స్పందించలేదని.. అదే బీజేపీ పాలిత రాష్ట్రాలయిన కర్ణాటక, గుజరాత్‌లకు మాత్రం తక్షణ సాయం చేశారని ఆరోపిస్తున్నారు.
కేటీఆర్ విమర్శలు.. ప్రధానంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని గురి పెట్టి ఉంటున్నాయి. వరదలు వచ్చినప్పుడు…కేంద్రంలో మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి హైదరాబాద్‌లో వాలిపోయారు. కేంద్రం సాయం చేస్తుందని … కానీ తెలంగాణ సర్కార్ పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పించారు. అదే సమయంలో కేంద్ర బృందాన్ని తీసుకొచ్చి అంచనాలు వేయించారు. కానీ కేంద్ర బృందం వెళ్లి చాలా కాలం అయినా ఇంత వరకూ ఒక్క రూపాయి సాయం చేస్తున్నట్లుగా ప్రకటన రాలేదు. దీన్నే కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. ఈ అంశాన్ని కిషన్ రెడ్డి మరో విధంగా డీల్ చేస్తున్నారు. సాయం అందలేదని అబద్దాలు చెబుతున్నారు. రోడ్ల మరమ్మత్తల కోసం , వరద సాయం కోసం.. రూ. నాలుగు వందల కోట్లపైనే ఇచ్చామన్న విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు.
అయితే అవి ఇతర ఖాతాల కింద ఇచ్చేవని.. ప్రత్యేకంగా వరద సాయం కోసం ఏమిచ్చారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. రానున్న గ్రేటర్ ఎన్నికల్లో.. తాము వరద సాయం పంపిణీ చేసిన కుటుంబాలను ఓటు బ్యాంక్‌గా వాడుకోవాలని టీఆర్ఎస్ పక్కా ప్రణాళికతో ఉంది. దానికి తగ్గ వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారు. అందుకే… సాయాన్ని కూడా పెంచుతున్నారు. అందుకే కౌంటర్ ఇవ్వడానికి బీజేపీ సమయం వెచ్చిస్తోంది.