కంచ గచ్చిబౌలి పై కేటీఆర్ తెలంగాణ ప్రజలకు ఓ బహిరంగలేఖ రాశారు. ఇప్పుడే అయిపోలేదని.. ఇంకా చాలా ఉందని కలసి కట్టుగా పోరాడదామని ఆ లేఖ సారాంశం. ఈ లేఖ ఇప్పుడు ఎందుకు రాయాల్సి వచ్చిందో కానీ.. ఆయన కంచ గచ్చిబౌలి విషయంలో పోరాటం క్రెడిట్ అంతా తనే తీసుకుని..తానే నాయకత్వం వహిస్తున్నట్లుగా కలర్ ఇవ్వడానికి ఆ లేఖలో ప్రయత్నించినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది.
ఈ విషయంలో బీఆర్ఎస్ నాయకత్వం ఉందని ఎవరూ అనుకోవడం లేదు. బీజేపీ కూడా పోరాడింది. మామూలుగా అయితే సెంట్రల్ వర్శిటీ స్టూడెంట్స్ చేసిన పోరాటం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. ఫేక్ వీడియోలు వాళ్లు సృష్టించారో.. లేదో కానీ జాతీయ మీడియా దృష్టి మాత్రం హెచ్‌సీయూ స్టూడెంట్స్ వల్లనే పడింది. అందుకే ఈ అంశానికి అంత ఫోకస్ వచ్చింది. భూముల అమ్మకం అనే టాపిక్ వస్తే బీఆర్ఎస్ పార్టీ చేసిందేమిటన్న ప్రశ్న అందరికీ వస్తుంది.
ఇప్పుడు ప్రభుత్వం హెచ్‌సీయూను తరలించి.. అక్కడ ఎకో పార్క్ ను ఏర్పాటు చేయాలన్న అంశాన్ని పరిశీలిస్తోంది. వన్యప్రాణాలు,, అటవీ సంరక్షణకే ఉద్యమం అయితే.. ప్రభుత్వ నిర్ణయానికి అందరూ సహకరించాల్సిందే. ఎందుకంటే ఉద్యమం జరిగింది అందుకే. సెంట్రల్ వర్శిటీలోనే ఎక్కువగా వన్య ప్రాణులు ఉంటాయి. అక్కడ వేట కూడా జరుగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు యూనివర్సిటీని తరలించకుండానే.. ఎకో పార్క్ ను ఏర్పాటు చేసుకుందామని కేటీఆర్ పిలుపునిస్తున్నారు.
కంచ గచ్చిబౌలి విషయంలో ఇప్పటికి అయితే.. ప్రభుత్వానికి ఎదురుదెబ్బలే తగిలాయి. ఆ క్రెడిట్ తమదేనని కేటీఆర్.. నాయకత్వం వహించేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో సకలజనులు చేసిన ఉద్యమం అంతా కేసీఆర్ ఘనతేనని క్రెడిట్ పొందిన విధంగా కేటీఆర్ కూడా ప్రయత్నిస్తున్నారు. మరి వర్కవుట్ అవుతుందా ?