తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచీ కూడా కెటీఆర్‌కి సినిమావాళ్ళతో సన్నిహిత సంబంధాలు ఒక రేంజ్లో పెరిగిపోతున్నాయి. సినిమావాళ్ళ అవసరాలు సినిమావాళ్ళకు ఉన్నాయి. ఇక గ్లామర్ ఫీల్డ్ విషయంలో ఎవరికి మాత్రం ఆకర్షణ ఉండదు? దానికి కెటీఆర్ కూడా అతీతుడేమీ కాదు. కానీ సినిమావాళ్ళతో తిరుగుతూ ….ప్రజా సమస్యల విషయంలో కూడా ఆ సినిమా డైలాగులు పేల్చితేనే కామెడీగా ఉంటుంది. తాజాగా కెసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాల్లో ఒకటైన డబుల్ బెడ్ రూం ఇళ్ళ కార్యక్రమంలో పాల్గొన్న కెటీఆర్ వ్యవహారం అలానే ఉంది. లంచం అడిగితే తరిమికొట్టండి అని ఠాగూర్‌లో చిరంజీవిలా, భారతీయుడులో కమల్ హాసన్‌లా ఓ భారీ డైలాగ్ పేల్చాడు కెటీఆర్. డైలాగ్ అదిరిపోయింది కదా. కెటీఆర్ మాటలకు ఇన్స్పైర్ అయిపోయి లంచం అడిగిన ఏ కానిస్టేబుల్‌నో, ఫోర్త్ గ్రేడ్ ఎంప్లాయినో…ఇంకా తక్కువ స్థాయి ఎంప్లాయినో ఏమైనా అని చూడండి. వేల ఏళ్ళ నుంచీ తెలంగాణా రాష్ట్రంలో ఉంటున్న కుటుంబమైనా సరే…రాష్ట్రంలో మీకు బ్రతికే అర్హత లేకుండా చేయకపోతే చూడండి. అయినా ఉస్మానియా విద్యార్థులు ఉద్యోగాల కోసం, పంట నష్టపోయిన రైతులు పరిహారం కోసం…ఇంకో ఎన్నోరకాలుగా అన్యాయాలు, అక్రమాలతో ఇబ్బందిపడుతున్నవాళ్ళు…వాళ్ళ ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం కాసేపు ధర్నా చేసుకుంటామంటేనే పోలీసు బలగాలను రంగంలోకి దింపే కల్వకుంట్ల కుటుంబం లంచం అడిగినవాళ్ళను తరిమికొట్టిన ప్రజలకు ఏం న్యాయం చేస్తుంది?
చిన్నస్థాయి ఉద్యోగి నుంచీ ముఖ్యమంత్రి వరకూ ప్రభుత్వంలో ఉన్న ఏ ఒక్కరిపైన అయినా ప్రజలు తిరగబడితే కెసీఆర్ ప్రభుత్వం ఊరుకుంటుందా? అందరూ కూడా ప్రజలకు సేవ చేయడం కోసం మాత్రమే ఉన్నారు అని రాజ్యాంగంలో రాసి ఉంటుంది అనుకోండి. కానీ వాస్తవం ఎలా ఉంటుందో కెటీఆర్‌కి తెలియదా? ఇక్కడ పల్లకీని మోస్తున్న వాళ్ళు ప్రజలే. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన వెంటనే పల్లకీ ఎక్కినవారు మాత్రం కల్వకుంట్ల కుటుంబంవారే. అయినా ప్రజలే అవినీతిపరులను తరిమికొట్టాలని మంత్రిస్థాయిలో ఉన్న కెటీఆర్ చెప్పడమేంటి? పాలనలో సాంకేతికతను ఉపయోగిస్తున్నాం….అన్ని విషయాలూ తెలుసుకుంటున్నాం అని అస్తమానం చెప్పుకునే ఐటీ శాఖా మంత్రికి తెలంగాణా రాష్ట్రంలో ఎక్కడ అవినీతి జరుగుతుందో? ప్రభుత్వంలో ఉన్న అవినీతిపరులు ఎవరో తెలియదా?
లంచం అడిగినవాళ్ళను తరిమికొట్టేయండి, దున్నేయండి, ఇరగదీయండి, చించెయ్యండి…..లాంటి డ్రమెటిక్ డైలాగులను బహిరంగ వేదికలపైన పేల్చినంత మాత్రాన అవినీతి అంతమైపోదు కెటీఆర్. అలాంటి మాటలు చెప్పినంత మాత్రాన మీరు అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఉద్యమకారులో, నీతిమంతులో అయిపోరు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా కెసీఆర్, కెటీఆర్ చేతుల్లోనే ఉందన్న విషయం ప్రజలందరికీ తెలుసు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే చేతల్లో చూపించండి. ఓటుకు కోట్లు కేసుతో సహా…ఇప్పటికే పూర్తి సాక్ష్యాలతో ఉన్న అవినీతి వ్యవహారాల కేసులు, నయిూంతో కలిసి కోట్లాది రూపాయలు దండుకున్న పోలీస్ ఆఫీసర్లు, ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులను ఎప్పుడు శిక్షిస్తారో చెప్పండి. ఆ విషయల్లో ఏమీ చేయలేనప్పుడు అవినీతి గురించి మాట్లాడడం మానేయండి. అంతేకానీ సినిమాటిక్ పంచ్ డైలాగులతో జనాల చెవుల్లో పువ్వులు పెట్టే కార్యక్రమం వద్దు కెటీఆర్జీ.