`మరక మంచిదే’ అన్నట్లుంది తెలంగాణ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్న ధోరణి. సమైక్య రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు చాలా మంచి జరిగిందని కేటీఆర్ గారి ఉవాచ. ఇంతకీ ఆయనగారి లాజిక్కేమిటంటే, సమైక్య రాష్ట్రం విడిపోబట్టే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి ఉరకలేస్తున్నదట. ఏపీ ముఖ్యమంత్రి అటు అమరావతికి, ఇటు పరిశ్రమల స్థాపనకు తీవ్రస్థాయిలో చేస్తున్న కృషిని దృష్టిలో ఉంచుకుని బహుశా కేటీఆర్ అలా మాట్లాడి ఉండవచ్చు. అయితే ఇప్పుడు ఆ విషయాన్ని మీడియా ముందు పదేపదే చెప్పడంలోని అంతరార్థం మాత్రం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలే.
హైదరాబాద్ లోని సీమాంధ్ర వాసులు తెలంగాణ ఉద్యమం సమయంలో అనేక రకాలుగా మాటలు పడ్డారు. తెలంగాణ నేతల నుంచేకాదు, ప్రజల నుంచి కూడా ఛీత్కారాలకు గురయ్యారు. ఆ బాధాకరమైన సంఘటనలను హైదరాబాద్ లోని సీమాంధ్ర పౌరులు మరచిపోలేదు. ఆ గాయాలకు ఇప్పుడు కేటీఆర్ ముందు రాయడానికి సిద్ధమయ్యారు. హైదరాబాద్ లోని ఆంధ్రా ఓటర్లకు గాలంవేయడమే ఆయన ప్రధానోద్దేశం. ఒక టివీలో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో `ఏదో భావోద్వేగాలతో ఆనాడు అలా అన్నాం. ఇప్పుడు అందరూ మాకు కావాల్సినవారే..’ అంటూ స్నేహ హస్తం చాస్తున్నారు. ఎన్నో రకాలుగా మాటలుపడిన హైదరాబాద్ ఆంధ్రులు వాటన్నింటినీ మరచిపోయి తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన తెరాసకు ఓట్లు వేస్తారా అన్నది అసలు ప్రశ్న. ఆనాడు రెచ్చగొట్టే రీతిలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తెరాస నేతలు చాలా తేలిగ్గా వెనక్కి తీసుకుంటున్నామని చెబుతున్నా, బాధితులు ఎలా స్పందిస్తారన్నది అనుమానమే.
ఇదిఇలా ఉండగా, కేటీఆర్ వారసత్వ రాజకీయాల గురించి కూడా మాట్లాడారు. మొదటిసారిగా రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ఈ వారసత్వమన్నది ఎంట్రీ పాస్ గా పనిజేస్తుందేతప్ప, ఆ తర్వాత మాత్రం ఎవరికివారు ప్రజాభిమానంతోనే ముందుకు వెళ్ళాలని కేటీఆర్ చెప్పుకొచ్చారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ వంద సీట్లు గెల్చుకోవడం ఖాయమనీ, అలా కాకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటున్నారు కేటీఆర్. కాగా, రెండో స్థానంలో మజ్లీస్ ఉంటుందని చెబుతున్నారు. కాంగ్రెస్ కొట్టుకుపోవడం ఖాయమనీ, తెలుగుదేశం- బిజెపీ పొత్తు రాణించదని ఆయన జోశ్యం చెబుతున్నారు.
మొత్తానికి నిజాయితీగా మాట్లాడతారన్న పేరుదక్కించుకున్న కేటీఆర్ హైదరాబాద్ లోని సీమాంధ్రులను కలుపుకుపోయేందుకు చాలా ఫ్రెండ్లీగా పావులుకదుపుతున్నారనే చెప్పాలి.
– కణ్వస