తెలంగాణ మంత్రివర్గ విస్తరణ దాదాపు ఖరారైంది. నిజానికి ఉగాదికే మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తొలుత భావించారు. అయితే కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఈ మంత్రివర్గ విస్తరణలో మార్పులు, చేర్పులను వాయిదా వేసుకున్నారు. దీనికి తోడు మంత్రుల పనితీరుపై ఇంటెలిజెన్స్ తో సహా ప్రైవేటు సంస్థలు ఇచ్చిన నివేదికలు క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి కూడా కొంత సమయం తీసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పుడు మంత్రివర్గంలో ఎవరికి స్థానం ఉంచాలి.. ఎవరిని బయటికి పంపాలి అనే అంశంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. భవిష్యత్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల తారక రామారావు అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణలో కేటీఆర్ మాట చెల్లుబాటు అవుతుందా…! లేక ముఖ్యమంత్రి కేసీఆర్ తన మార్కు విస్తరణ చూపిస్తారా అన్నది పార్టీలో చర్చ జరుగుతోంది. ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈసారి మంత్రి వర్గ విస్తరణలో తన ఇమేజ్ కి తగ్గట్లుగా మంత్రుల ఎంపిక జరగాలని పట్టుబడుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. తనకు అత్యంత సన్నిహితులైన బాల్క సుమన్, కాంత్రి కిరణ్ లతో సహా మరో నలుగురికి ఈసారి మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని కేటీఆర్ ముఖ్యమంత్రిపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. మంత్రి పదవి కోసమే బాల్క సుమన్ లోక్ సభను వదులుకొని శాసనసభకు వచ్చారని, మంత్రి పదవిపై ఆయనకు కేటీఆర్ వాగ్దానం చేశారని చెబుతున్నారు. కేటీఆర్ ఇస్తున్న జాబితాలో అందరూ యువకులేనని, తొలిసారి శాసనసభకు వచ్చిన వారే కావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి అభ్యంతరాలు వస్తున్నాయని అంటున్నారు. సీనియర్లకు మంత్రులుగా అవకాశం కల్పిస్తే కుటుంబంపై ఉన్న మచ్చ పోతుందని, కేటీఆర్ సూచించిన వారిలో ఒకరిద్దరికి మాత్రమే అవకాశం కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేసినట్లు సమాచారం. రానున్న మంత్రివర్గ విస్తరణతో కేటీఆర్ ప్రాభల్యం ఉంటుందా..? లేక కేసీఆర్ ఆధిపత్యానిదే పైచేయిగా నిలుస్తుందా..? అనేది తేలిపోతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.