తన హత్యకు కుట్ర పన్నారంటూ ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలు తెలంగాణ రాజకీయవర్గాల్లోనూ సంచలనం సృష్టించాయి. ఆ తర్వాత కేంద్రం వై కేటగిరీ సెక్యూరిటీ కల్పించబోతోందన్న ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా ఇవి రాజకీయ ఆరోపణలే అనుకోకుండా మంత్రి కేటీఆర్ కూడా రంగంలోకి దిగారు. హోంశాఖ తనది కాకపోయినా… సీరియస్ గా స్పందించారు. వెంటనే డీజీపీతో మాట్లాడి సీనియర్ అధికారితో విచారణ చేయించి ఈటలకు తగినంత భద్రత కల్పించాలని కోరారు.
కేటీఆర్ కోరినట్లుగా చెప్పినా అది ఆదేశం కావడంతో వెంటనే ఓ సీనియర్ అధికారిని విచారణకు నియమించారు. అయితే ఇక్కడ ట్విస్టేమిటంటే ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలు బీఆర్ఎస్ మీదనే. ఇంకా చెప్పాలంటే ప్రగతి భవన్ మీదనే అంటే..కేసీఆర్ మీదనే. పాడి కౌశిక్ రెడ్డి తన హత్యకు రూ. ఇరవై కోట్ల సుపారీ ఇచ్చాడని.. ఇదంతా ప్రగతి భవన్ ప్రోత్సాహంతోనే జరుగుతోందని ఈటల చెబుతున్నారు. తమ మీద ఆరోపణలు చేసినా కేటీఆర్.. విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు.
అయితే కేటీఆర్ తీరు మాత్రం బీజేపీలో అనే సందేహాలకు తావిస్తోంది. కేంద్రం ఆషామాషీగా సెక్యూరిటీ ఇవ్వదని..ఏదో ఇంటలిజెన్స్ రిపోర్ట్ వచ్చి ఉంటుందని అంటున్నారు. ఈ వియయంలో ఎందుకైనా మంచిదని ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా విచారణ పేరుతో కేటీఆర్ హడావుడి చేస్తున్నారని అంటున్నారు. ఏదైనా ఈటల చేసింది రాజకీయ ఆరోపణే అయినా కేటీఆర్ స్పందన మాత్రం.. చాలా మందికి పజిల్ గా మారింది.