మోక్షానికి వెళ్తే మొసలి ఎత్తుకుపోయిందనీ వెనకటికో సామెత ఉంది. తెలంగాణ కేటీఆర్ కి ఇప్పుడు ఇలాంటి పరిస్థితే అనుభవంలోకి వచ్చిందని చెప్పాలి. పవన్ కల్యాణ్ నటించి కాటమ రాయుడు చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ తో మంత్రి కేటీఆర్ సెల్పీ దిగిన సంగతి కూడా తెలిసిందే. ఈ ఫొటో సోషల్ మీడియాలో హల్ చేస్తోంది. అయితే, ఇప్పుడీ సెల్ఫీపై నెటిజన్లు మండిపడుతున్నారు. కొంతమంది తెలంగాణ వాదులు ఈ సెల్ఫీపై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు.
ఒక్కసారి గతం గుర్తు చేసుకుంటే.. తెరాస నేతలు అంటే చాలు, పవన్ అగ్గిమీద గుగ్గిలం అయిన రోజులు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా కేటీఆర్ పై చాలా విమర్శలు చేశారు. ఇక, కవిత – పవన్ కల్యాణ్ ల మధ్య మాటల యుద్ధం చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఈ గతాన్ని కేటీఆర్ మరచిపోతే ఎలా అంటూ కొంతమంది నెటిజన్లు మంత్రి కేటీఆర్ ను సూటిగా ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ వాదాన్ని అంతగా వ్యతిరేకించిన పవన్ కల్యాణ్ తో ఇలా సెల్ఫీలు దిగడం సరికాదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అయితే, కేటీఆర్ సెల్ఫీ దిగింది వేరే కారణంతో అనేవారూ ఉన్నారు. కాటమ రాయుడు సినిమా ద్వారా చేనేతల్ని బాగా ప్రోత్సహించారు పవన్. ఎలాగూ కేటీఆర్ కూడా చేనేత మంత్రి కావడంతో, ఇలా సెల్ఫీ దిగడం తప్పులేదని కొంతమంది వాదిస్తున్నారు.
ఈ సెల్ఫీ నేపథ్యంలో తెలంగాణ నెటిజన్ల నుంచి వ్యక్తమౌతున్న అభిప్రాయాల్ని జనసేన అధినేత గమనించాలని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే, వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో పోటీకి జనసేన సిద్ధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ పల్స్ ఎలా ఉందో, జనసేన మార్చుకోవాల్సింది ఏంటో ఒక్కసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.
2019లో తెలంగాణలో కూడా జనసేన పోటీ చేసే అవకాశాలున్నట్టు సంకేతాలు ఇచ్చారు. ఇలాంటప్పుడు, పవన్ మీదగానీ, జనసేన పార్టీపైగానీ ఈ ప్రాంతం నుంచి వ్యక్తమౌతున్న ప్రతీ అభిప్రాయాన్నీ కౌంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సెల్ఫీ విషయంలో కేటీఆర్ ను నెటిజన్లు విమర్శిస్తున్నా.. పరోక్షంగా పవన్ పై వ్యక్తమౌతున్న వ్యతిరేకతను తెలుసుకోవాలి. అప్పుడే తెలంగాణలో జనసేన ఎలా వ్యవహరించాలో అర్థమౌతుంది. మరి, ఇలాంటి సున్నితమైన అంశాలను పవన్ పరిగణనలోకి తీసుకుంటారో లేదో..?