ఏసీబీ కేసు ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ తెలంగాణ హైకోర్టు కొట్టి వేయడంతో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై తప్పుడు కేసు పెట్టారని .. ఎలాంటి అవినీతి లేకపోయినా ఏసీబీ కేసు పెట్టారని చెల్లదని .. తన వాదనను తెలంగాణ హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ హైకోర్టు తీర్పును.. ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని ఆయన కోరారు.
తెలంగాణ హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత నెక్ట్స్ ఏం చేయాలన్నదానిపై సన్నిహితులతో విస్తృతంగా చర్చలు జరిపారు. హైకోర్టులో ఆర్డర్ ఇచ్చింది సింగిల్ బెంచ్ కాబట్టి డివిజన్ బెంచ్ కు వెళ్లడం లేదా… సుప్రీంకోర్టుకు వెళ్లడం అనే రెండు మార్గాలపై ఆయన లీగల్ టీం వర్కవుట్ చేసింది. అయితే డివిజన్ బెంచ్ లో విచారణ అలస్యమవుతుందన్న అభిప్రాయం వినిపించడంతో నేరుగా సుప్రీంకోర్టుకు వెల్లాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరుక పిటిషన్ దాఖలు చేశారు. ఎప్పుడు విచారణకు వస్తుందో బుధవారం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
న్యాయపోరాటం చేయకపోతే ఈ కేసులో నిండా ముంచేసి సుదీర్ఘ కాలం జైల్లో ఉంచుతారన్న అనుమానం కేటీఆర్ లో ఉంది. ఇది తన రాజకీయ భవిష్యత్ ను ప్రభావితం చేసే ఉద్దేశం ఉందన్న అభిప్రాయంతో ఆయన న్యాయపోరాటం కూడా చేయాలని అనుకుంటున్నారు. తప్పు చేయలేదని కోర్టులతో చెప్పిస్తే సమస్య ఉండదని అనుకుంటున్నారు. విచారణ పేరుతో న్యాయపోారటం చేయకుండా నేరుగా వెళ్తే పులి నోట్ల తల పెట్టినట్లేనన్న భావనకు వచ్చి.. న్యాయపోరాటానికే మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది.
అయితే అరెస్టు ముప్పు మాత్రం కేటీఆర్కు పొంచి ఉంది. సుప్రీంకోర్టుకు వెళ్లినా అక్కడ రిలీఫ్ రాకపోతే తప్పు జరిగిందని అందరూ నిర్దారించేశారన్న అభిప్రాయానికి వస్తారు. అదే జరిగితే కేటీఆర్ ను అరెస్టు చేసినా ప్రజల నుంచి స్పందన రాదు. అనుకున్నంతగా మైలేజ్ రాదు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ ను కొట్టివేయడంతోనే … ఈ కేసులో ఏదో ఉందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయని చెబుతున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణకు ఆయనకు చాలా కీలకం.