మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసిన సంగతి తెలిసిందే. అధికార పార్టీలో టిక్కెట్లు ఆశిస్తున్నవారి హడావుడి అంతా ఇంతా కాదు. సొంత పార్టీ నుంచి ఎప్పట్నుంచో ప్రయోజనాల కోసం ఎదురుచూస్తున్నవారు కొందరైతే, ఇతర పార్టీల నుంచి తెరాసలోకి వచ్చి చేరిన తాజా నేతలూ ఉన్నారు కదా! క్షేత్రస్థాయిలో అభ్యర్థుల ఎంపిక తెరాసకు ఓరకంగా సవాల్ గా మారిన పరిస్థితే. అందర్నీ సంతృప్తిపరచడం అసాధ్యం. అయితే, ఈ క్రమంలో అసంతృప్తుల్ని వీలైనంత త్వరగా బుజ్జగించకపోతే, సొంత పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే ఆలోచన ఉన్నవారితో ప్రమాదం! దీంతో అభ్యర్థుల ఎంపిక కసరత్తుపై ప్రత్యేక దృష్టిపెట్టారు తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.
అభ్యర్థుల జాబితాని మంత్రి కేటీఆర్ ఫైనల్ చేస్తారు అని తెలిసిన దగ్గర్నుంచీ, తెలంగాణ భవన్ కి ఆశావహుల తాకిడి ఎక్కువైంది. దీంతో, అభ్యర్థుల ఎంపిక ఒక ప్రక్రియ ప్రకారం జరుగుతుందని మంత్రి చెబుతున్నారట! రాష్ట్ర స్థాయిలో ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని కేటీఆర్ నియమించినట్టు సమాచారం. ఇదే కమిటీ జిల్లాలవారీగా పర్యటించి, అక్కడి పార్టీ శ్రేణులతో అభ్యర్థుల ఎంపికను ఎలా చేపట్టాలనే విధివిధానాలను వివరిస్తుంది. పార్టీ జిల్లా అధ్యక్షులను సమన్వయం చేసుకుంటూ ఆశావహుల జాబితా తయారు చేసేలా చూస్తుంది. అయితే, ఆశావహులు ఎంతమంది ఉన్నా… జిల్లా స్థాయిలోనే వడబోత కార్యక్రమం పూర్తి చేస్తారట. అందరి అర్హతలూ పరిశీలించాక… జిల్లా నుంచి అతి తక్కువ సంఖ్యతో జాబితాలు రూపొందించి పార్టీకి పంపించాలి.
అలా రాష్ట్ర స్థాయికి వచ్చిన జాబితాలను కూడా కేటీఆర్ ఒక్కరే కూర్చుని నేరుగా ఫైనల్ చేయరట! ఇక్కడ కూడా మరోసారి త్రిసభ్య కమిటీ ఆ జబితాను అధ్యయనం చేసి.. అంతిమంగా కేటీఆర్ కి పంపిస్తారు. ఆ తరువాత, ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ తోపాటు త్రిసభ్య సభ్యుల కమిటీ… అందరూ భేటీ అయి అభ్యర్థుల తుది జాబితాను ఖరారు చేస్తారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ఇలా డిజైన్ చేసింది కేటీఆర్..! ఎక్కడా ఎలాంటి సిఫార్సులు పనిచేయవని సందేశం ఇస్తూ… అంతా కమిటీ ద్వారా జరుగుతుందని పార్టీ వర్గాలకు తెలిస్తే… తెలంగాణ భవన్ కి ఆశావహుల తాకిడి తగ్గుతుందని భావిస్తున్నారు. అయితే, ఆశించిన అందరికీ టిక్కెట్లు రావు కాబట్టి అసంతృప్తులు కచ్చితంగా ఉంటాయి. వాటిని వెంటనే సరిచేసే బాధ్యతల్ని స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులకు కేటీఆర్ అప్పగించినట్టు సమాచారం. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వ్యూహమైతే పక్కాగా ఉంది. అమలులో ఎలా ఉంటుందో చూడాలి.