రాష్ట్రంలో భాజపా బలోపేతం అవుతోందనే టాపిక్ మీద స్పందించడానికి కూడా ఇష్టపడేవారు కాదు తెరాస నేతలు. నాలుగు లోక్ సభ స్థానాలు ఆ పార్టీ గెలుచుకున్నా, దాన్నో గెలుపుగా మాట్లాడేవారు కాదు. తెరాసకు పోటీ ఎవ్వరూ లేరనే అనేవారు. అయితే, భాజపా బలం గురించి తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి మాట్లాడారు. గతవారంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ రెండో స్థానంలో ఉందన్నట్టుగా కేటీఆర్ స్పందించారు. గురువారం జరిగిన కార్యకర్తల సమావేశంలో భాజపా బలాన్ని తక్కువగా చూడొద్దంటూ కేడర్ కి చెప్పారు.
లోక్ సభ ఎన్నికల సమయంలో ఆ పార్టీని ఈజీగా తీసుకుని పొరపాటు చేశామనీ, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో అలాంటిది పునరావృతం కాకూడదన్నారు కేటీఆర్. భాజపా పుంజుకుంటోందనీ, మనం వారి విమర్శల్ని బలంగా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. మన తప్పుల వల్లనే భాజపాకి నాలుగు ఎంపీ సీట్లు వచ్చాయనీ, మళ్లీ అలాంటి పొరపాటు ఎక్కడా జరక్కుండా జాగ్రత్త పడాలని కేడర్ కి చెప్పారు. మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడుంటాయనేది ఈనెల 28న హైకోర్టు స్పష్టం చేస్తుందనీ, ఇదే సమయంలో భాజపా కూడా మున్సిపల్ స్థానాలు దక్కించుకునే ప్రయత్నంలో ఉందనీ, గట్టి పోటీ ఇవ్వాలని చూస్తోందన్నారు. రాష్ట్రంలో మనం అమలు చేస్తున్న పథకాల గురించి ప్రజలకి చెప్పాలనీ, ఆయుష్మాన్ భవ కంటే ఆరోగ్య శ్రీ ద్వారానే ఎక్కువ లాభం ఉంటుందనేది కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
కేడర్ లో స్ఫూర్తి నింపడానికి భాజపా బలాన్ని అస్త్రంగా వాడుకుంటున్నారు కేటీఆర్. మనం నిర్లక్ష్యంగా ఉంటే ఆ పార్టీకి లాభం చేకూరుతుందనే కోణంలో పార్టీ కేడర్ కి చెబుతున్నారు. అంటే, శత్రువు బలపడుతున్నారు కాబట్టి, అంతకంటే మనం బలపడాలని అంటున్నట్టే కదా! లోక్ సభ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో తెరాస ఓటమిని సొంత పార్టీ తప్పిదంగా ఇప్పుడు ఒప్పుకుంటున్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఈ తరహా విశ్లేషణ చేసుకోలేదు. భాజపా గుబులు లేదు లేదని పైపైకి చెబుతున్నా… పార్టీ కార్యకర్తలతో సమావేశం దగ్గరకి వచ్చేసరికి ఆ పార్టీ ఎదుగుతోందని అంటున్నారు. మొత్తానికి, ఒక ప్రతిపక్షమంటూ ఉండాలనీ, ఉంటేనే ఎప్పటికప్పుడు కేడర్ ను అప్రమత్తం చేసేందుకు, వారిలో స్ఫూర్తిని నింపేందుకు ఇలా వారి బలాన్ని బూచిగా చూపించి మాట్లాడటానికి పనికొస్తుందని ఇప్పుడిప్పుడే కేటీఆర్ కి తెలిసొస్తున్నట్టుగా ఉంది.