ఓపక్క, తెలివైన ఆంధ్రోళ్లు… మేధావులైన ఆంధ్రోళ్లు అంటూ… హైదరాబాద్ అవతల జరిగే సభల్లో కేసీఆర్ విమర్శిస్తుంటారు. ఇంకోపక్క, ఆంధ్రా రాయలసీమ అనే ప్రాంతీయ భేదాలు లేకుండా అందర్నీ కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నాం అంటూ… హైదరాబాద్ లోపల జరిగే కొన్ని సభల్లో కేటీఆర్ కవర్ చేస్తుంటారు! నగరంలో జరిగిన సీమాంధ్రుల సంఘీభావ సభలో ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. గత నెలలో నిజాంపేటలో జరిగిన సభ మారిదిగానే.. ఈరోజు కూడా ఇక్కడి సీమాంధ్రులను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడారు. జరిగింది రాష్ట్రాల విభజన మాత్రమేననీ, ప్రజల విభజన కాదన్నారు. గత ఎన్నికల్లో తెరాస మీద కొంత అనుమానం, ఏదో జరిగిపోతుందన్న ఒక అపోహతో తమ మీద కోపంతో వ్యతిరేకంగా ఓట్లేశారు తప్ప… పొరపాటున కూడా ఆనాడు టీడీపీ మీద అభిమానంతో వేసినవి కాదని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ ఏర్పడి సరిగ్గా పదహారు నెలల తరువాత జరిగిన జి.హెచ్.ఎం.సి. ఎన్నికల్లో తెరాసకు ఇక్కడివారు బ్రహ్మరథం పట్టడమే అందుకు సాక్ష్యం అన్నారు. తొమ్మిదేళ్లలో హైదరాబాద్ నిర్మించానని చెప్పుకునే చంద్రబాబు… నాలుగున్నరేళ్లలో అమరావతి ఎందుకు నిర్మించలేకపోయారని విమర్శించారు.
ప్రసంగంలో భాగంగా స్వర్గీయ నందమూరి హరికృష్ణ గురించి మరోసారి మాట్లాడారు కేటీఆర్. నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగితే, వెంటనే మంత్రి జగదీశ్వర్ రెడ్డి స్పందించారు అన్నారు. అక్కడి నుంచి చంద్రబాబు నాయుడుతో సహా ఆయన హైదరాబాద్ కి వెంటే ఉంటూ వచ్చారనీ, ఆ తరువాత కేసీఆర్, తాను ఇతర నేతలు వెళ్లి పరామర్శించామన్నారు. ఇలాంటి సందర్భాల్లో ఎప్పుడూ తాము రాజకీయాలు చేయాలని ఆలోచించలేదన్నారు. ఆ కుటుంబానికి అండగా నిలవడానికి వెళ్లామేగానీ… రాజకీయాలకు చేయాలని కాదు. కానీ, ఇవాళ్ల ప్రతీ చిన్న విషయాన్నీ చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.
నిజాంపేటలో సీమాంధ్రులతో సమావేశం సందర్భంగా కూడా ఇదే విషయాన్ని కేటీఆర్ ప్రస్థావించారు. ఇది రాజకీయం కాకపోతే.. మరోసారి ఇప్పుడు ఎందుకు ప్రస్థావించాలి..? హరికృష్ణ మరణానంతరం తెరాస సర్కారు ఎంత వేగంగా చురుగ్గా మానవతాదృక్పథంతో స్పందించింది అనేది పదేపదే ఎందుకు చెప్పాలి..? ఆ సందర్భంలో తెరాస సర్కారు వ్యవహార శైలిపై ఎవ్వరూ ఎలాంటి విమర్శలూ చెయ్యలేదు కదా. అలాంటి పరిస్థితి ఉంటే వివరణ ఇచ్చుకున్నట్టు మాట్లాడినా కొంత అర్థవంతంగా ఉండేది. ఒక విషయం రాజకీయం కాదు అనుకున్నప్పుడు… ఆ విషయానికి ప్రసంగంలో ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలి?
సీమాంధ్రులతో నిర్వహించిన గత సభ, తాజా సభ… ఈ రెంటిలో ఏదో ఒక ఎమోషనల్ అంశాన్ని అంతర్లీనంగా తెరమీదికి తీసుకొచ్చే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నారు. సీమాంధ్రుల మనోభావాలపై బలమైన ముద్ర వేసుకున్న కొన్ని ఘటనల్ని గుర్తుచేసి.. ఆయా సందర్భాల్లో వారి పాత్రను గొప్పగా చెప్పుకుంటూ పొందాలనుకుంటున్న లబ్ధి ఏంటనేది మళ్లీమళ్లీ చెప్పుకోవాల్సిన పనిలేదు.