ఏపీలో జగన్ , తెలంగాణలో కేటీఆర్..ఇద్దరూ ఓ ట్రాన్స్ లో ఉన్నట్టు తెలుస్తోంది. రెండు పార్టీల అహంకార, ఆధిపత్య రాజకీయాలతో విసిగి జనాలు బండకేసి కొట్టినా, టోన్ ఇంకా మార్చుకోవడం లేదు. ప్రజలు తమను ఓడించినా తమకు నష్టమేమీ లేదని, ప్రజలకే నష్టం అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించడం పట్ల విమర్శలు వస్తున్నాయి.
తెలంగాణ భవన్ లో కేటీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో పార్టీకి నష్టం లేదని, అప్పుడే జనాలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ ఓటమి ఆ పార్టీకి ఎందుకు నష్టం కాదో కేటీఆర్ కు కూడా తెలియనిది కాదు. పార్టీ ఓటమి వలన కీలక నేతలు, పలువురు ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. లోక్ సభ ఎన్నికలు పార్టీ పరువు తీశాయి. ఓటమిని జీర్ణించుకోలేక కేసీఆర్ ఫామ్ హౌజ్ కు మాత్రమే పరిమితం అయ్యారు. ఆయన బయటకు రావాలని క్యాడర్ కోరుకుంటున్నా ఫామ్ హౌజ్ గడప దాటడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను కూడా ప్రకటించలేకపోయింది. పార్టీ గ్రాఫ్ పతనం అవుతూ వచ్చింది. అయినా కేటీఆర్ మాత్రం బీఆర్ఎస్ కు ఎలాంటి నష్టం లేదని, ప్రజలకే నష్టం జరిగిందని చెప్పడం ఆయన కుంచిత రాజకీయ మనస్తత్వానికి నిదర్శనమని అంటున్నారు. కేటీఆర్ తరహాలోనే వైసీపీ లీడర్లు కూడా ఇదే పల్లవి వినిపిస్తుండటం గమనార్హం.
మరోవైపు..ఏపీలో కూటమి, తెలంగాణలో కాంగ్రెస్ పాలనను చూసి ఇక్కడ జగన్, అక్కడ కేసీఆర్ ను సీఎం కావాలని కోరుకుంటున్నారని ఆ పార్టీల నేతలు అంటున్నారు. అదే నిజమైతే, కేసీఆర్ , జగన్ లు ప్రజాక్షేత్రంలోకి ఎందుకు రావడం లేదనేది ప్రత్యర్థి పార్టీ నేతల ప్రశ్న. కేవలం సోషల్ మీడియా ఊపును చూసి బలుపు అనుకుంటున్నారని, కలలో విహరించడం మానేయాలని సెటైర్లు వేస్తున్నారు. ఏదీ ఏమైనా…వైసీపీ, బీఆర్ఎస్ ఓటమిపై ఆత్మవిమర్శ చేసుకోకుండా ప్రజలే మోసపోయారు అనే సిగ్నల్స్ పంపడం సరైంది కాదనే విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి.