సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెచ్చగొడుతున్నారా.. ?పదేపదే టార్గెట్ చేస్తున్నా రేవంత్ ఎందుకు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు..?తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పుడిదే అంశంపై చర్చ జరుగుతోంది
కేటీఆర్ ఎక్కడికి వెళ్లినా రేవంత్ ను టార్గెట్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. రైతులు రేవంత్ పై ఆగ్రహంగా ఉన్నారని, వారి మాటలు వింటే ఎవరైనా ఉరేసుకొని చనిపోయే వారని, రేవంత్ కనుక ఆగిపోతున్నారని అసంబద్ద వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యారు. గతంలో రేవంత్ ను అవమానించేలా అసెంబ్లీలో ఏకవచనంతో సంబోధించిన కేటీఆర్..తాజాగా ఓ పిరికిపంద అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్ చేస్తోన్న వ్యాఖ్యలు రేవంత్ కు ఎలా అనిపిస్తున్నాయో కానీ, ఆయన అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. కేటీఆర్ చేస్తోన్న వ్యాఖ్యలకు అదే స్థాయిలో వీలునప్పుడల్లా రేవంత్ కూడా తన మార్క్ స్టైల్ లో సమాధానం ఇస్తున్నారు. ఇది అన్నివేళలా సాధ్యం కాదు.. ప్రభుత్వాన్ని, పార్టీని సమన్వయం చేసుకుంటూ రేవంత్ ముందుకు వెళ్తున్నారు. అందుకే కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలను రేవంత్ పెద్దగా పట్టించుకోవడం లేదు.
కేటీఆర్ మాత్రం నిత్యం రేవంత్ పై దూషణలకు దిగిపోతున్నారు. అడ్డు, అదుపు లేకుండా మాట్లాడుతున్నారు. వీటిని రేవంత్ లైట్ తీసుకుంటున్నారు. ఆయన స్వభావం తెలిసిన వారు ఎందుకు రేవంత్ ఇంత లైట్ తీసుకొంటున్నారని అనుకుంటున్నారు. రెచ్చగొడుతున్నా మౌనంగా ఉంటున్నారంటే, త్వరలో ఏదో విస్పోటనం చెలరేగే ప్రమాదం ఉందని రేవంత్ సన్నిహితులు చెబుతున్న మాట.