బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు జడ్జిమెంట్ డే. ఆయన క్వాష్ పిటిషన్ పై తీర్పు ఈ రోజు వెల్లడి కానుంది. తీర్పు ఆయనకు అనుకూలంగా వస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కానీ వ్యతిరేకంగా వస్తే మాత్రం గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది. అది లొట్టపీసు కేసు అని తనను బుక్ చేయడానికి అవసరమైన ఆధారాలు లేవని ఆయన చెబుతున్నారు. ఒక వేళ కోర్టు క్వాష్ చేయడానికి నిరాకరిస్తే అందులో సబ్జెక్ట్ ఉన్నట్లు ఆయన కూడా అంగీకరించాల్సిన పరిస్థితి వస్తుంది.
గవర్నర్ అనుమతి ఇచ్చిన కేసును హైకోర్టు క్వాష్ చేస్తుందని న్యాయనిపుణులు అనుకోవడం లేదు. రూ. 55 కోట్లు అక్రమంగా విదేశీ కంపెనీకి వెళ్లిపోయాయనని బహిరంగంగా తెలిసిన విషయమే. ఈ అంశంపై కేసు లేదని కోర్టు కొట్టేస్తుందని ఎలా అనుకుంటామని లాయర్లు అంటున్నారు. ఈ తీర్పుపై ఆశతోనే కేటీఆర్ విచారణకు హాజరుకావడం లేదు. ఏసీబీ నోటీసులు ఇచ్చినా తన లాయర్లను అనుమతించలేదని చెప్పి ఆయన విచారణకు వెళ్లలేదు. దీంతో ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది.ఈడీ ఎదుట ఇవాళ హాజరు కావాల్సి ఉంది.
కానీ కేటీఆర్ హాజరయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
నిజానికి కేటీఆర్ దాఖలు చేసింది ఏసీబీ కేసుపై క్వాష్ పిటిషన్ . ఈడీ కేసుపై కాదు. కానీ ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా నమోదు చేశారు కాబట్టి.. దాన్ని కొట్టి వేస్తే ఈడీ కేసూ చెల్లదని వాదించే అవకాశం ఉంటుంది. మొత్తంగా కేటీఆర్ కు అత్యంత గడ్డు పరిస్థితుల్లో ఉన్నారు. క్వాష్ పిటిషన్ పై తీర్పు ఆయనకు అనుకూలంగా రాకపోతే ఇప్పటి వరకూ చేసిన రాజకీయం కారణంగా ఇంకా ఎక్కువ సమస్యలు ఎదుర్కోనున్నారు.