ఖమ్మం జిల్లా పాలేరు ఉపఎన్నికల కోసం తెరాస చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకొంది కనుక అక్కడ ఘన విజయం సాధించడం దానికి పెద్ద కష్టమేమీ కాదని చెప్పవచ్చు. అందుకే తెరాస ఓడిపోతే తను రాజీనామా చేస్తానని, కాంగ్రెస్ ఓడిపోతే పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తారా? అంటూ మంత్రి కేటీఆర్ సవాలు విసిరారు. తెరాసకు విజయావకాశాలు ఉంటే ఉండవచ్చు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి సీనియర్ నేతకి కేటీఆర్ అటువంటి సవాలు విసరడం సమంజసంగా లేదు. అందుకే ఆయన “నువ్వు కాదు మీ నాయిన (కేసీఆర్) ఆ సవాలుకి సిద్దమయితే నేను సిద్దమే,” అని జవాబు చెప్పి కేటీఆర్ తన స్థాయికి సరితూగే నేత కాదని చెప్పకనే చెప్పారు. అయినా కేటీఆర్ వెనక్కి తగ్గకుండా ఈసారి రాహుల్ గాంధీతో తనను పోల్చుకొని మాట్లాడుతూ “నేను బచ్చాగాడినయితే మరి నా కంటే కేవలం రెండుమూడేళ్ళు మాత్రమే పెద్దయిన రాహుల్ గాంధీని ఏమనుకోవాలి?” అని ప్రశ్నించారు. అంటే రాహుల్ గాంధీ కూడా బచ్చాగాడే కదా అని చెపుతున్నట్లుంది.
రాహుల్ గాంధీ ఆమర్ధుడు, తల్లి చాటు బిడ్డడనే సంగతి బహిరంగ రహస్యమే. కానీ ఎంత కాదనుకొన్నా అయన ఒక జాతీయ స్థాయి నాయకుడే. కానీ కేటీఆర్ మంత్రి అయినప్పటికీ ఒక ప్రాంతీయ పార్టీ నేత మాత్రమే. కనుక రాహుల్ గాంధీతో పోల్చు కోవడమే తప్పు. పైగా రాజకీయంగా వైఫల్యం చెందిన అటువంటి వ్యక్తితో తనను తాను పోల్చుకోవడం అంటే కేటీఆర్ తన స్థాయిన తనే తగ్గించుకొన్నట్లవుతుంది తప్ప పెంచుకొన్నట్లవదు. అయినా ఈ ఉపఎన్నికలలో తమ పార్టీ లక్ష ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తుందని కేటీఆర్ చాలా నమ్మకంగా చెపుతున్నప్పుడు, ఈ ఉపఎన్నికల కోసం ఆయన మరీ ఇంతగా రెచ్చిపోవలసిన అవసరం ఉందా? అని అయన ఆలోచించుకోవాలి. తండ్రి ముఖ్యమంత్రి, తను మంత్రి అనే అహంకారంతోనే ఆయన ఆ విదంగా విర్రవీగుతున్నారనే కాంగ్రెస్ నేతల ప్రచారం, ప్రజల మనస్సులో నాటుకొంటే, ఉజ్వల భవిష్యత్ ఉన్న ఆయనకి అది ఎంత మాత్రం మంచిది కాదని గుర్తిస్తే మంచిది. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండగలిగిన వారికే ప్రజలలో గౌరవం ఏర్పడుతుందని గుర్తుంచుకోవాలి.