ఏదో సినిమాలో ఓ విలన్ పక్కన ఉండే వ్యక్తి.. ప్రతీ దానికి వేసేయ్ అని..బొడ్లో ఉన్న కత్తిని తీసేందుకు ప్రయత్నిస్తూంటాడు. పక్కన ఉన్న బాస్ కు కూడా చిరాకేస్తూ ఉంటుంటుంది. అలాంటి సీన్లు అప్పుడప్పుడు రాజకీయాల్లో కనిపిస్తూ ఉంటాయి. కేటీఆర్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో తరచూ ఇలాంటి డైలాగ్ నే వాడుతున్నారు. కోర్టు నోటీసులు జారీ చేస్తే చాలు మేము ఉపఎన్నికలకు సిద్ధం అని ప్రకటిస్తూ ఉంటారు.
తాజాగా సుప్రీంకోర్టు బీఆర్ఎస్ నేత దాఖలు చేసిన ఓ కేసులో ఏడుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. మొత్తం రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఒక దాంట్లో విచారణ జరిపి పదో తేదీకి వాయిదా వేశారు. మరో పిటిషన్ ను కూడా పదోతేదీకి వాయిదా వేశారు. అదే రోజున రెండు పిటిషన్లు కలిపి విచారిస్తామని తెలిపింది. పిటిషన్ లో బీఆర్ఎస్ నేతలు పేర్కొన్న ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. ఇది న్యాయపరంగా జరిగే సహజ ప్రక్రియ. అయితే కేటీఆర్ వెంటనే మేం ఉపఎన్నికలకు రెడీ.. వారిపై అనర్హతా వేటు పడకుండా ఎవరూ ఆపలేరు అని ప్రకటించేశారు.
నిజానికి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఓ ఎమ్మెల్యే లేదా ఎంపీపై అనర్హతా వేటు వేయాలంటే అది ఒక్క స్పీకర్ వల్లనే సాధ్యమవుతుంది. కోర్టులు కూడా చేయలేవు. కోర్టులు స్పీకర్ను కూడా ఆదేశించలేవు. కానీ సూచించగలవు. అయితే కేటీఆర్ మాత్రం ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు పడిపోతుదంని గట్టిగా నమ్ముతున్నారో.. ఎవరినైనా నమ్మించాలనుకుంటున్నారోకానీ.. ప్రతి సందర్భంలో చిన్న డెలవప్మెంట్ వచ్చినా ఉపఎన్నికలకు రెడీ అని ట్వీట్ పెట్టేస్తున్నారు.