తాను డ్రగ్స్ అడిక్ట్ నంటూ బండి సంజయ్ చేస్తున్న విమర్శలకు మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నా బొచ్చు కావాలంటే బొచ్చు ఇస్త, రక్తంతో పాటు కిడ్నీ కూడా ఇస్తానని డ్రగ్స్ తో పాటు ఏ టెస్టులు చేయిస్తాడో చేయించుకో అని సవాల్ చేశారు. డ్రగ్స్ టెస్టులో తాను క్లీన్ చిట్ తో బయటకు వస్తే కరీంనగర్ కమాన్ వద్ద బండి సంజయ్ తన చెప్పుతో తానే కొట్టుకుంటాడా అని కేటీఆర్ సవాల్ చేశారు. కేటీఆర్ తో పాటు టీఆర్ఎస్ నేతలు ఇటీవలి కాలంలో బండి సంజయ్ పై తంబాకు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. దీనికి కౌంటర్ గా ఇటీవల.. కేటీఆర్ పై డ్రగ్స్ ఆరోపణలు చేశారు.
కేటీఆర్ రెండు వెంట్రుకలు.. కాలి గోళ్లు ఇస్తే చాలని డ్రగ్స్ తీసుకున్నారో లేదో నిరూపిస్తామన్నారు. గతంలో రేవంత్ రెడ్డి కూడా నేరుగా కేటీఆర్ పై డ్రగ్స్ ఆరోపణలు చేయలేదు కానీ.. వైట్ చాలెంజ్ పేరుతో టెస్టులకు రావాలని సవాల్ చేశారు. అప్పట్లో రేవంత్ రెడ్డి.. కేటీఆర్ తో పాటు బండి సంజయ్ తో పాటు కొండా విశ్వేశ్వర్ రెడ్డిలకు వైట్ చాలెంజ్ విసిరారు. బండి సంజయ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి .. చాలెంజ్ కు అంగీకారం తెలిపారు. అయితే కేటీఆర్ మాత్రం హాజరు కాలేదు. దీనిపై రేవంత్ రెడ్డి ఆరోపణలు చాలెంజ్‌లు కొనసాగిస్తూండటంతో కేటీఆర్ కోర్టుకు వెళ్లి.. డ్రగ్స్ అంశంపై మాట్లాడకుండా ఆదేశాలు తెచ్చుకున్నారు.
ఆ అంశం అంతటితో ముగిసింది. అయితే ఇప్పుడు కొత్తగా బండి సంజయ్ డ్రగ్స్ కేసుల గురించి తరచూ ప్రస్తావిస్తున్నారు. రోహిత్ రెడ్డిపైనా డ్రగ్స్ ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో..కేటీఆర్ నేరుగా బండి సంజయ్ కు సవాల్ విసిరారు. ముందుగా బండిసంజయ్ టెస్టుల సవాల్ చేశారు.. కేటీఆర్ కూడా సై అన్నారు. ఇప్పుడు.. బండి సంజయ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.