ఈ కార్ రేసులో స్కామంటా లీకులిస్తున్నారని అసెంబ్లీలో చర్చించడానికి సిద్ధమని మంత్రికేటీఆర్.. సీఎం రేవంత్ కు సవాల్ చేశారు. ఈ మేరకు ఓ బహిరంగ లేఖను సీఎంకు విడుదల చేశారు. ఫార్ములా ఈ రేస్ స్కాంపై ఏడాదికి తనపై నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారని దీనిపై గంట సేపు కేబినెట్లో చర్చిస్తారా అని మండిపడ్డారు. కేసులు నమోదు చేస్తామని, గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఆమోదం వచ్చిందని రకరకాల లీకులు సీఎం కార్యాలయం నుండి మీడియాకు ఇస్తున్నారని.. అసెంబ్లీలో చర్చ పెడితే నిజానిజాలేంటో ప్రజలకు తెలుస్తాయన్నారు.
హైదరాబాద్ నగరానికి మంచి జరగాలనే సదుద్దేశంతో ఫార్ములా-ఈ రేస్ నిర్వాహకులతో ఒప్పందం చేసుకున్నామని.. దీని వల్ల ఆర్థిక వ్యవస్థకు సుమారు రూ.700 కోట్ల రూపాయల లాభం వచ్చిందన్నారు. రెండో దఫా రేస్ జరగాల్సి ఉన్నా రద్దు చేశారని మండిపడ్డారు. ఒప్పందం అంతా పారదర్శకంగా జరిగిందని ప్రజలకు నిజాలు తెలియాలన్నారు. చెల్లింపులు కూడా పారదర్శకంగానే జరిగాయని.. ఎక్కడా అవకతవకలు జరగలేదన్నారు.
ప్రజలకు నిజాలు తెలియాలంటే అసెంబ్లీలో చర్చ జరగాలన్నారు. మీకు అనుకూలమైన రోజే ఈ చర్చను పెట్టాలన్నారు. ఫార్ములా-ఈ అంశంలో ఎలాంటి అవకతవకలు కానీ, అవినీతి కానీ జరగలేదు. రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి మంచి చేసే ఈ రేస్‌ను కేవలం మీ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు బలి చేశారని ఆరోపించారు. ఈ అంశంపై ఏసీబీ కేసు నమోదు చేయబోతున్న తరుణంలో అసెంబ్లీలో చర్చకు కేటీఆర్ సవాల్ చేయడంతో రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.