ఈ మధ్య జరుగుతున్న వరుస ఎన్నికల్లో అధికార పార్టీ తెరాసను సీఎం కుమారుడు కేటీఆర్ ముందుండి నడిపించారు. ఒక్క లోక్ సభ ఎన్నికల్లోనే అనుకున్నట్టు ఫలితాలు రాలేదు. సారూ కారూ పదహారూ అనుకున్నా… కాంగ్రెస్ తోపాటు భాజపాకి కూడా కొన్ని సీట్లు దక్కడంతో తెరాస శ్రేణులకు కొంత నిరుత్సాహం తప్పలేదు. అయితే, ఆ ఫలితాలపై తెరాసలో పెద్దగా చర్చ జరగలేదనే చెప్పాలి. ఎందుకంటే, జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలను పెద్ద సంఖ్యలో కైవసం చేసుకుంది. దీంతో, ప్రజలంతా మనవైపే ఉన్నారనీ, లోక్ సభ ఎన్నికల్లో ఏదో కాస్త అటుఇటు అయిందని కేటీఆర్ విశ్లేషించి సరిపెట్టుకున్నారు. అయితే, త్వరలో పురపాలక ఎన్నికలు రాబోతున్నాయి. వాటిని సమర్థంగా ఎదుర్కోవడంలో భాగంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పటిష్టంగా చేపడుతున్నారు కేటీఆర్.
పట్టణాలు, నగరాల్లో పెద్ద సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేయాలనే లక్ష్యాలను నాయకులకు కేటీఆర్ నిర్దేశించారు. ఇదే అంశమై సమీక్షిస్తూ… రాబోయే పురపాలక ఎన్నికలు మనకు కీలకమనీ, వాటిని సమర్థంగా ఎదుర్కోవడానికి ఇప్పట్నుంచే సిద్ధం కావాలన్నారు. పార్టీలోకి చేరేందుకు చాలామంది స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారనీ, వారికి ప్రాధాన్యత ఇవ్వాలంటూ నేతలకు సూచించారు. పట్టణాలు, నగరాల్లోని స్థానిక కేబుల్ టీవీ నెట్ వర్క్ లను పార్టీ ప్రచారం కోసం వాడుకోవాలన్నారు. వాట్సాప్, ఫేస్ బుక్ లాంటి సామాజిక మాధ్యమాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఆటో డ్రైవర్లు, బీడీ కార్మికులు వంటి వాళ్ల దగ్గరకి నాయకులు నేరుగా వెళ్లాలని చెప్పారు.
జెడ్పీ ఎన్నికలతో పోల్చుకుంటే, రాబోయే పురపాలక ఎన్నికలకు తెరాసకు సవాల్ గానే మారే అవకాశం ఉంది. ఎందుకంటే, భాజపా కూడా మొదట ఈ ఎన్నికల్నే టార్గెట్ చేస్తోంది. పట్టణ, నగర ప్రాంతాల్లో జరిగే ఎన్నికలు కాబట్టి, కాస్త గట్టిగా ప్రయత్నిస్తే తమ ఉనికిని చాటుకోవడానికి ఇదే మంచి పునాది అవుతుందనే వ్యూహంతో ఉంది. అందుకే, ఆ పార్టీ కూడా సభ్యత్వ నమోదు లక్ష్యాల్లో అర్బన్ ప్రాంతాలకీ ప్రాధాన్యత ఇస్తోంది. జెడ్పీ ఎన్నికల్లో తెరాసకు బలమైన పోటీ ఎవ్వరూ ఇవ్వలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ యథావిధిగా డీలా పడింది. రాబోయే పురపాలక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వగలదా అనే అనుమానాలు అలానే ఉన్నాయి. కానీ, ఈసారి భాజపా నుంచి తెరాసకు గట్టి పోటీ ఎదురవుతుంది. ఈసారి అర్బన్ ఓటింగ్ ఉంటుంది. సహజంగానే అర్బన్ ప్రాంత ఓటర్లను భాజపా ఈజీగా ఆకట్టుకోగలదు అనే అభిప్రాయమూ ఉంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా దీన్ని సమర్థంగా ఎదుర్కోవడం కేటీఆర్ కి కొత్త సవాల్ గా చెప్పుకోవచ్చు.