తెరాస నుంచి ఇతర పార్టీలు పొందాల్సిన స్ఫూర్తే ఇది! అధికారంలో ఉన్నా కూడా… ఎన్నికలకు వచ్చేసరికి, పార్టీకి సానుకూలం అవుతుంది అనుకుంటే ఏ చిన్ని అవకాశాన్ని కూడా తెరాస వదులుకోదు! మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నాయి.. ఇప్పుడు కూడా అదే వ్యూహంతో తెరాస ముందుకెళ్తోంది. ప్రతిపక్షాలకు ఎక్కడా అవకాశం ఇవ్వకూడన్న వ్యూహంతో ఉన్నారు తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇప్పటికే ఆయన నాయకులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేశారు. దీంతోపాటు, రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై మరోసారి సర్వే చేయించుకుంటున్నట్టు సమాచారం. నిజానికి, గడచిన జులై నుంచే తెరాస మున్సిపోల్స్ కి సిద్ధమైంది. అప్పట్నుంచీ వరుస సర్వేలు చేయిస్తూనే ఉన్నారు. తాజాగా మరో సర్వే జరుగుతున్నట్టు సమాచారం.
దీంతోపాటు, పార్టీ ఇన్ ఛార్జులకు ఆయన మరో టాస్క్ ఇచ్చారట! అదేంటంటే… పార్టీలో చేరికలు పెంచడం! సర్వేల ఆధారంగా తెరాసకు కాస్త కష్టమౌతుంది, ప్రతిపక్ష పార్టీల పట్టు ఎక్కువ ఉందీ అనే ప్రాంతాల్లో చేరికలపై ప్రత్యేక దృష్టిపెట్టమని కేటీఆర్ ఆదేశించారని తెలుస్తోంది. దీంతో, ఇప్పుడు కొన్ని మున్సిపాలిటీల పరిధిలో క్షేత్రస్థాయి నేతలకు నేరుగా జిల్లా స్థాయి తెరాస నేతల నుంచి ఫోన్లు వెళ్తున్నాయని తెరాస వర్గాల్లో చర్చ జరుగుతోంది. అవసరం అనుకున్న చోట.. స్థానిక ఎమ్మెల్యేలు, లేదా మంత్రులు కూడా లైన్లోకి వెళ్లి నేతల్ని చేర్చుకునే కార్యక్రమాల్ని చూసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే జిల్లా స్థాయిల్లో పెద్ద సంఖ్యలో ద్వితీయ శ్రేణి నాయకుల చేరికల కార్యక్రమాలు ఉంటాయని తెరాస వర్గాలు అంటున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి లాంటి కీలక నేతల నియోజక వర్గాల్లో ఇలా కింది స్థాయిలో చేరికల్ని ప్రోత్సహించే తెరాస పెద్ద ఎత్తున లాభపడిందనడంలో సందేహం లేదు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ని ఎదుర్కోవడం కోసం కింది స్థాయిలో ఇదే వ్యూహాన్ని అమలు చేశారు! ఇప్పుడు కూడా అదే వ్యూహం. నిజానికి, ఇదే తరహా కసరత్తు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా జరగలేదు. అందుకే కొన్ని స్థానాలను కోల్పోవాల్సి వచ్చిందని మున్సిపల్ ఇన్ ఛార్జ్ లతో మంత్రి కేటీఆర్ చెప్పారనీ, అలాంటి తప్పు మరోసారి జరగడానికి వీల్లేదని అన్నారని పార్టీ వర్గాలు ద్వారా తెలుస్తోంది. నిజానికి, ఇప్పటికే చాలా నియోజక వర్గాల్లో చేరికల వల్ల సొంత పార్టీలో కుంపట్లు రాజుకున్న పరిస్థితి చూస్తున్నాం. ఇంకా చేరికల్ని ప్రోత్సహిస్తూ పోతూ ఉంటే.. భవిష్యత్తులో పార్టీకి మరిన్ని తలనొప్పులు తప్పవు కదా? తాత్కాలిక ప్రయోజనాలే చూసుకుంటున్నారుగానీ… భవిష్యత్తులో ఇవే పెద్ద సమస్యలుగా మారే అవకాశాలను తెరాస చేజేతులా పెంచుకుంటోందనే అభిప్రాయమూ వ్యక్తమౌతోంది.