బీఆర్ఎస్ వరుస ఓటములకు బాధ్యత వహిస్తూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయాలని కేటీఆర్ పై ఒత్తిడి పెరుగుతోంది. పార్టీకి వరుస ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగులుతున్నా కేటీఆర్ పట్టించుకోకపోవడం పార్టీకి ఏమాత్రం మంచిది కాదని… కేటీఆర్ స్థానంలో మరో నేతకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను అప్పగించాలనే డిమాండ్ లు తెరమీదకు వస్తున్నాయి.
గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అనూహ్య ఓటమి చవిచూసింది. అయినా, పార్టీ ఓటమిపై వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో సమీక్షలు కూడా చేయలేదని కేటీఆర్ పై అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన కొద్ది కాలానికే పార్లమెంట్ ఎన్నికలు ఉంటాయని తెలిసినా, క్యాడర్ కు బూస్టింగ్ ఇచ్చేందుకు నియోజకవర్గాల వారీగా కేటీఆర్ రివ్యూ చేయకపోవడం పార్టీ నాయకుల్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లేలా చేసిందన్న అభిప్రాయం కనిపిస్తోంది. కేటీఆర్ నిర్లక్ష్య వైఖరి, ఒంటెత్తు పోకడలే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ తీవ్ర పరాభవం చవిచూసేలా చేసిందని పార్టీ నేతలు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
తమను పిలిచి కేటీఆర్ మాట్లాడితే ఇదే విషయాన్ని చెబుదామని ఇంతకాలం వెయిట్ చేసినా తమకు పార్టీ నుంచి పిలుపు రాలేదని… అందుకే దిక్కుతోచని స్థితిలో పార్టీ ప్రేమికులుగా ఇలా సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నామని పేర్కొంటున్నారు. అయితే, కేటీఆర్ రాజీనామాపై ఒత్తిడి పెరుగుతుండటంతో ఆయన రాజీనామా చేస్తారా…? అనేది చర్చనీయాంశంగా మారింది. నేతల ఒత్తిళ్ళ మేరకు రాజీనామా చేస్తే పార్టీపై కేటీఆర్ కు పట్టు సడలేలా చేస్తోంది. నేతల అభిప్రాయాలను గౌరవించకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిలో కొనసాగితే ఈ డిమాండ్లు ఎక్కువయ్యే అవకాశం ఉంది.
దీంతో కేటీఆర్ ఈ విషయంలో ఏం చేస్తారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ప్రస్తుతం కేటీఆర్ కు ముందు నుయ్యి వెనక గొయ్యి అనే మాదిరి పరిస్థితులు తయారయ్యాయి.