ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో కేటీఆర్ ఏసీబీ విచారణ కోసం ఏసీబీ ఆఫీసు వరకూ వెళ్లారు కానీ అక్కడ విచారణకు హాజరు కాలేదు. తన న్యాయవాదిని అనుమతించరని తెలుసు కాబట్టి ముందుగానే తయారు చేసుకున్న ఓ లేఖను ఏసీబీ అధికారికి ఇచ్చి తన లాయర్ ను అనుమతించని కారణంగా తాను ఏసీబీ విచారణకు రావడం లేదు.. వారికి ఎలాంటి సమాచారం కావాలన్నా లిఖితపూర్వకంగా ఇస్తానని చెప్పి తెలంగాణ భవన్ కు వెళ్లిపోయారు. కేటీఆర్ తీరుతో ఏసీబీ అధికారులు కూడా అవాక్కయ్యారు.
విచారణకు సహకరించాలని హైకోర్టు చెప్పింది. విచారణ చేసుకోవచ్చని ఏసీబీకి హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. అయితే విచారణకు పిలిస్తే న్యాయవాదిని అనుమతించాలని చెప్పలేదు. కానీ ఇటీవల పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేసినప్పుడు పోలీసులు తప్పుడు స్టేట్మెంట్ రాసుకున్నారని ఇప్పుడు కూడా అలాగే రాసుకుంటారన్న అనుమానం ఉందని కేటీఆర్ అంటున్నారు. అందుకే తన న్యాయవాదిని విచారణకు అనుమతించాలని అంటున్నారు.
హైకోర్టులో తీర్పు రిజర్వ్ చేశాక విచారణకు పిలవాల్సిన అవసరం లేదని హైకోర్టు, చట్టాలు, రాజ్యాంగంపై గౌరవంతో ఏసీబీ ఆఫీసుకు వచ్చానని కేటీఆర్ చెప్పుకొచ్చారు. తన వెంట న్యాయవాదులు ఉంటే ఈ ప్రభుత్వానికి సమస్య ఏంటో చెప్పాలన్నారు. విచారణ పేరుతో ఇక్కడికి పిలిచి… తన ఇంటి పైన దాడులు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. విచారణకు లాయర్లను అనుమతించే సంప్రదాయం లేదని.. కస్టడీలోకి తీసుకున్నప్పుడు హైకోర్టు ఆదేశల మేరకు విచారణకు లాయర్ ను అనుమతిస్తారని పోలీసులు అంటున్నారు.
మొత్తంగా కేటీఆర్ విచారణకుహాజరు కాకూడదనుకున్నారు. కానీ డుమ్మా కొట్టినట్లుగా ఉండకూడదు. ఏదో ఒకటి లిటిగేషన్ పెట్టి ఏసీబీ ఆఫీస్ నుంచి వెనక్కి వెళ్లిపోయారన్న అభిప్రాయం వినిపిస్తోంది. మరి ఈడీ విచారణకు ఇదే ఫార్ములా పాటిస్తారా లేకపోతే కొత్త ప్రయత్నం చేస్తారా అన్నది రేపు తేలే అవకాశం ఉంది.