మున్సిపల్ ఎన్నికల బరిలో తెరాస రెబెల్ అభ్యర్థులు సొంత పార్టీకే దడపుట్టిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు ఎవ్వరూ భయపడుతున్నట్టు కనిపించడం లేదు. పార్టీ నుంచి బహిష్కరిస్తామంటున్నా, పదవులు ఇస్తామని భరోసా ఇస్తున్నా తగ్గడం లేదు. ఇదే అంశమై మరోసారి పార్టీ నేతలతో సమావేశమై చర్చించారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రగతి భవన్లో రెబెల్స్ బలాబలాలపై సమీక్ష చేశారు. కార్పొరేషన్లలో డివిజన్లవారీగా పార్టీ పరిస్థితిని తెలుసుకున్నారు.
మున్సిపాలిటీల కంటే కార్పొరేషన్లలోనే పెద్ద సంఖ్యలో రెబెల్స్ బరిలో ఉన్నారనే అంశాన్ని నేతలు కేటీఆర్ ద్రుష్టికి తీసుకెళ్లారు. కార్పొరేషన్లు పార్టీకి చాలా ప్రతిష్టాత్మకమనీ, ముందుగా ఈ పరిధిలో ఉన్న రెబెల్స్ తో వెంటనే చర్చలు ప్రారంభించాలనీ, పార్టీ నుంచి దక్కబోయే ఇతర పదవులపై వారీ హామీ ఇవ్వాలంటూ ఎమ్మెల్యేలకు కేటీఆర్ ఆదేశించారు. ఒక్క కార్పొరేషన్ కూడా చేజారడానికి వీల్లేదని నేతలకు చెప్పారు. బలమైన నేతలతో వెంటనే చర్చలకు వెళ్లాలనీ, ఏరకంగానైనా ఒప్పించి తీరాలనీ, పార్టీ నుంచి బీ ఫామ్ అందుకున్న అభ్యర్థి తప్ప… ఇంకెవ్వరూ బరిలో ఉండకుండా చూడాలని చెప్పారు.
గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు మొదలుకొని జిల్లా, మండల పరిషత్.. ఇలా అన్నింటి తెరాస వ్యూహం ఒకలా ఉండేది. ఇతర పార్టీలను ఎలా దెబ్బకొట్టాలీ, కింది స్థాయి నేతల్ని తెరాసలోకి ఎలా ఆకర్షించాలానే వ్యూహాల చుట్టూనే పార్టీ కార్యాచరణ ప్రణాళికా చర్చలు ఉండేవి. కానీ, మున్సిపల్ ఎన్నికలు వచ్చేసరికి… సొంత పార్టీ నేతల్ని బుజ్జగించుకోవడమే తెరాసకు కష్టంగా మారింది. గడచిన మూడు రోజులుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇదే పని మీద ఉన్నారు. ఇతర పార్టీల నుంచి కింది స్థాయి నేతల్ని ఎలా లాక్కుందామా అనే చూసే స్థాయి నుంచి… మన నాయకుల్ని ఇతర పార్టీల వలలకు చిక్కకుండా ఎలా కాపాడుకుందామా అనే పరిస్థితిని తెరాస ఎదుర్కొంటోంది. నామినేషన్ల ఉపసంహరణకు ఒక్కరోజే గడువు ఉంది. ఈలోగా ఎంతమందిని బుజ్జగించ గలుగుతారో చూడాలి.