జాతీయ రాజకీయాలపై తెలంగాణ రాష్ట్ర సమితి చాలా ఆశలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో చక్రం తిప్పాలని సీఎం కేసీఆర్ కలలు కంటున్నారు. మంచిదే.. ఆ అవకాశం వస్తే, తెలుగువారిగా అందరూ గర్విస్తాం. అయితే, ఆ అవకాశం తెచ్చుకోవడం కోసం ప్రాక్టికల్ గా చేయాల్సిన ప్రయత్నాలు కంటే… ఊహాజనిత పరిస్థితులపైనే తెరాస ఎక్కువగా ఆధారపడుతున్నట్టుగా ఉంది. సాక్షి పత్రికకు ఒక సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఇచ్యారు కేటీఆర్. 2014 నాటి పరిస్థితులు ఇప్పుడు లేవన్నారు. గత ఎన్నికల్లో భాజపాకి సోలోగా మెజారిటీ వచ్చిందిగానీ, తమ అంచనా ప్రకారం ఇప్పుడు 150 సీట్లకు మించి ఆ పార్టీ దక్కించుకోలేదని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పరిస్థితి కూడా ఇలానే ఉందనీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో 100 ఎంపీ స్థానాలు దక్కించుకోవడం కూడా కష్టంగానే కనిపిస్తోందన్నారు.
మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, మాయావతి, నవీన్ పట్నాయక్, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి… వీళ్లందరి మధ్యనే 150 నుంచి 170 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని కేటీఆర్ చెప్పారు! ఇలాంటప్పుడు ఇంకొకరి చేతిలో అధికారం ఎందుకు పెట్టాలన్నారు. తెలంగాణలో 16 ఎంపీ సీట్లు గెలిస్తే ఏం చెయ్యగలరని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శిస్తున్నారు అన్నారు. 16 మందితోపాటు కేసీఆర్ కి ప్రజల్లో విశ్వాసం మాదిరిగానే… ఇతర ప్రాంతాల్లో ప్రాంతీయ పార్టీలు గెలిచే అవకాశాలున్నాయని, ఈ విషయం తెలంగాణ ప్రజలకు అర్థమౌందని కేటీఆర్ చెప్పారు.
కేటీఆర్ చెబుతున్నట్టుగా మమత, అఖిలేష్, మాయావతి, నవీన్, జగన్.. వీళ్లంతా కేసీఆర్ తో కలిసేందుకు సిద్ధంగా ఉన్నారా..? ప్రస్తుత పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి కదా! అఖిలేష్ – మాయావతి… ఢిల్లీలో తామే చక్రం తిప్పాలన్న పట్టుదలతో ఉన్నారు. ఎస్పీ, బీఎస్పీ కూటమికి కనీసం 80లో 45 సీట్లు వచ్చే పరిస్థితి యూపీలో ఉందనే అంచనాలున్నాయి. ఆ లెక్కన.. 45 సీట్లున్నవారు ఆధిపత్యం చెలాయిస్తారా, 16 సీట్లు దక్కించుకున్నవారి మాట వారు వింటారా..? ఇక, మమతా బెనర్జీ కూడా సొంతంగా ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు. 42 స్థానాల్లో మమతా పోటీ పడుతున్నారు. అక్కడ ఆమెకి 30 ప్లస్ సీట్లు దక్కితే… ఆమె కూడా ఢిల్లీ రాజకీయాల్లో డిమాండ్ చేసే శక్తిగా ఎదుగుతారు. కేసీఆర్ గట్టిగా ప్రయత్నిస్తే నవీన్ పట్నాయక్… ప్రయత్నించకపోయినా జగన్… ఆయన వెంట ఉండే అవకాశాలు మాత్రమే ఇప్పుడున్నాయి. మమత, మాయావతి, అఖిలేష్.. వీరెవ్వరితోనూ కేసీఆర్ ఫెడరల్ చర్చలు ఫలించలేదు. కానీ, ఇప్పుడు కేటీఆర్ వీరందరూ తమతోనే ఉన్నట్టుగా చెప్పేస్తున్నారు. వారితో తెరాస ఉండాలా… తెరాస వెంట వారు ఉండాలా అనేది ఎన్నికల తరువాతి పరిస్థితులు నిర్ణయిస్తాయి. వీరందరినీ కూటమిగా కట్టే ప్రయత్నాలైనా ఇప్పుడు కేసీఆర్ చేస్తున్నారా.. అంటే, అదీ లేదు కదా?