“మా తాత ఎన్టీఆర్, మా నాన్న చంద్రబాబులా పేరు తెచ్చుకుంటానో లేదో కానీ… వాళ్ల పేరు మాత్రం చెడగొట్టను”.. ఇదీ తనపై ఆరోపణలొచ్చినప్పుడల్లా నారా లోకేష్ చెప్పే మాట. కొంచెం అటూ..ఇటుగా ఇలాంటి మాటనే చెప్పారు. . తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. తారకరామారావు పేరు నిలబెట్టే పని చేస్తా కానీ చెడగొట్టే పని చేయనన్నారు. బాలకృష్ణ చైర్మన్ గా వ్యవహరిస్తున్న బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో… బీఎంటీ యూనిట్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మొదటగా ఈ కార్యక్రమంలో మాట్లాడిన బాలకృష్ణ కూడా.. నాన్న స్ఫూర్తితోనే కేసీఆర్ తన కుమారుడికి తారకరామారావు పేరు పెట్టారని చెప్పారు. దానికి తగ్గట్లుగా కేటీఆర్ తన ప్రసంగంలో పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. తారక రామారావు పేరు నిలబెడతానన్నారు.
తెలంగాణ ఉద్యమం.. ఆ తర్వాత పరిణామాల్లో కేటీఆర్ పేరు చాలా సార్లు హాట్ టాపిక్ అయింది. ఎన్టీఆర్ సంబంధించిన జ్ఞాపకాలను.. హైదరాబాద్ లో తుడిచేసే ప్రయత్నాలను కేసీఆర్ చేశారని గతంలో టీడీపీ నేతలు ఆరోపించారు. కుమారుడికి ఎన్టీఆర్ పేరు పెట్టుకుని.. ఆ మహానుభావుడిపైనే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు.. ఎన్టీఆర్ కు సంబంధించిన విషయాల్లో వివాదాలొస్తే ముందు కేటీఆర్ పేరును గుర్తు చేసి విమర్శలు చేసేవారు. కేటీఆర్ అసలు పేరు తారక రామారావు కాదని అజయ్ అని… అప్పట్లో ఎన్టీఆర్ దృష్టిలో పడేందుకు..టిక్కెట్ పొందేందుకు..తారక రామారావు అని మార్చారని.. రేవంత్ విమర్శలు చేసేవారు. దీనికి కౌంటర్ గా ఓ సారి కేటీఆర్ కూడా… తన పేరును.. ఎన్టీఆర్ స్ఫూర్తితో పెట్టలేదని చెప్పుకొచ్చారు కూడా.
కానీ ఇప్పుడు రాజకీయాలు మారుతున్నాయేమో కానీ… కేటీఆర్ కూడా..తనకు తారక రామారావు పేరు ఉండటాన్ని గర్వంగా ఫీవుతున్నారు. ఆయన పేరును నిలబెడతానంటున్నారు. క్యాన్సర్ ఆస్పత్రి కార్యక్రమంలో .. బాలకృష్ణను కేటీఆర్ పొగడ్తలతో ముంచెత్తారు. బాలకృష్ణ తన ఫేవరేట్ హీరో అన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి గురించి తన తల్లి ఎన్నో సార్లు చెప్పారని.. ఆస్పత్రి అభివృద్ధికి ఏదో ఒకటి చేయాలని అమ్మ చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. నిజానికి కేసీఆర్ నివాసం… క్యాన్సర్ ఆస్పత్రి సమీపంలోనే ఉంటుంది. గతంలో కేసీఆర్ కూడా.. క్యాన్సర్ ఆస్పత్రికి వచ్చి సాయం కోసం ఎంతో మంది తన ఇంటికి వచ్చేవారని.. వారికి సాయం చేసేవాడినని కూడా గుర్తు చేసుకున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ పేరు నిలబెట్టడానికి తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు యువ నేతలు తెలంగాణలో కేటీఆర్, ఏపీలో లోకేష్ సిద్ధమయ్యారు.