హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీ, తన సోదరి కవిత ఎంతో డైనమిక్‌గా ఉంటుందని ఆమె సోదరుడు, తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి తారక రామారావు అన్నారు. పలు సందర్భాలలో ఆమెనుంచి స్ఫూర్తిని పొందుతుంటానని చెప్పారు. ఆంగ్ల లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు ‘రిట్జ్’, ‘యు అండ్ ఐ’ తమ తాజా సంచికలలో కేటీఆర్‌పై కవర్ పేజి కథనాలు ఇచ్చాయి. 27 ఏళ్ళ వయసులో ఎమ్మెల్యేగా, 35 ఏళ్ళ వయసులో క్యాబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేటీఆర్‌లో చురుకుదనం, అనుభవం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయని పేర్కొన్నాయి. రిట్జ్ మ్యాగజైన్ – ‘ది కంప్లీట్ మ్యాన్’ పేరుతో, యు అండ్ ఐ మ్యాగజైన్ – ‘మ్యాన్ ఆఫ్ ఎ మిషన్’ పేరుతో ఈ కథనాలను ఇస్తూ ప్రశంసల వర్షం కురిపించాయి. గూగుల్ లాంటి అంతర్జాతీయ సంస్థలను హైదరాబాద్‌కు రప్పించటం, పబ్లిక్ వైఫై, స్టార్టప్ కంపెనీలకు ఊతమిచ్చేలా టి-హబ్ ఏర్పాటు చేయటం, యువతకు శిక్షణ ఇచ్చేందుకు, నైపుణ్యాలు అందించేందుకు టాస్క్ వంటి నూతన వేదికలను ఏర్పాటు చేయటం కేటీఆర్ విజయాలని పేర్కొన్నాయి.
ప్రభుత్వం ఏర్పాటైన తొలి ఏడాదిలోనే నిరంతరాయంగా విద్యుత్ ఇవ్వటం, శాంతిభద్రతలు అదుపులో ఉంచటం, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవిధంగా పారిశ్రామికవేత్తలను ఆకర్షించటంలో తాము సఫలీకృతమయ్యామని కేటీఆర్ ఇంటర్వ్యూలలో చెప్పారు. పుష్కలంగా ఉన్న సహజ వనరులు, అద్భుతమైన మానవ వనరులు తెలంగాణలో ఉండటం తమకు అదనపు బలం అన్నారు. 2006లో కరీంనగర్ ఉప ఎన్నికల సందర్భంగా రాజకీయంవైపు అడుగులేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. బోర్డింగ్ స్కూళ్ళలో చదివిన అనుభవం కారణంగా తొలుత రాజకీయాలు ఒకింత భారంగా అనిపించినా, కాలం తనకు ఎంతో అనుభవాన్ని నేర్పించిందని అన్నారు.
ముఖ్యమంత్రి సతీమణి అయినా తన తల్లి స్వయంగా వంటచేయటం తనకు ముచ్చటేస్తుందని కేటీఆర్ చెప్పారు. పలు సందర్భాలలో తల్లి చెప్పే మాటలు మార్గదర్శకంగా ఉంటాయని అన్నారు. రాజకీయాలలో నిలదెక్కుకోవటంలో తన సతీమణి శైలిమ సహకారం ఎంతో ఉందని చెప్పారు.