హైదరాబాద్: తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు అయిన కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సామర్థ్యానికి, తాహతుకు మంత్రి పదవే ఎక్కువని అన్నారు. ఇంతకంటే ఎక్కువ ఆశించటం దురాశే అవుతుందని వ్యాఖ్యానించారు. నిన్న ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ప్రస్తుతం యాక్టింగ్ సీఎమ్గా వ్యవహరిస్తున్నారని, భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారని ప్రచారంలో ఉన్న వాదనపై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ మంత్రి పై విధంగా స్పందించారు. తన తండ్రి కేసీఆర్ వల్లే తాను మంత్రిని అయ్యానని, ఇది తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. కేసీఆర్ చెబితే మంత్రి పదవికూడా వదులుకునేందుకు సిద్ధమని అన్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికలపై మాట్లాడుతూ, 150 డివిజన్లలోనూ పోటీ చేస్తామని చెప్పారు. మజ్లిస్ పార్టీతో ఎన్నికల అనంతర పొత్తులు ఉండొచ్చని అన్నారు. మొట్టమొదటిసారిగా వేసవికాలంలోనూ పవర్ కట్లు లేకుండా విద్యుత్ సరఫరా చేసినందును తమ పార్టీని నగర ప్రజలు మెచ్చుకుని గెలిపిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. దైవభక్తి లేకపోవటంపై మాట్లాడుతూ, ఎవరి విశ్వాసాలు వారివని, ఒకరి విశ్వాసాలను మరొకరు గౌరవించుకోవాలని అన్నారు. తన తండ్రికి దైవభక్తి బాగా ఉన్నప్పటికీ తనకు ఆ విశ్వాసం లేదని, అందుకే మంత్రిగా ఆత్మసాక్షిగా ప్రమాణస్వీకారం చేశానని చెప్పారు. తన తండ్రికూడా తన విశ్వాసాలను తమపై రుద్దలేదని అన్నారు. ఒకరి విశ్వాసాలను మరొకరు గౌరవించుకోకపోవటంవల్లనే దేశంలో అసహనంపై ఇంత రాద్ధాంతం జరుగుతోందని వ్యాఖ్యానించారు.
ఫిల్మ్ ఇండస్ట్రీపై మాట్లాడుతూ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీపై 30,000 మంది ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు. వీరిలో ఎక్కువమంది సీమాంధ్రవారే ఉన్నారని, తెలంగాణ రాగానే వారిలో భయం ఏర్పడిన మాట నిజమేనని అన్నారు. అయితే తానే స్వయంగా వారితో పలు దఫాలు సమావేశమై ఆ భయాందోళనలను పోగొట్టానని చెప్పారు. ఈ ఇండస్ట్రీ పోతే రు.1,000 కోట్ల టర్నోవర్ ఉన్న వ్యాపారాన్ని తెలంగాణ కోల్పోతుందని కేటీఆర్ అన్నారు.