హైదరాబాద్ నగరం అనేక పరిశ్రమలకు నెలవు. భారీ పరిశ్రమలే కాదు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కొదువలేదు. వీటిలో కాలుష్యాన్ని వెదజల్లే ఫార్మా, తదితర రంగాల పరిశ్రమలూ ఉన్నాయి. వీటి వల్ల నగరంలో కాలుష్యం పెరుగుతోంది. భూగర్భజలం విషతుల్యం అవుతోంది. వీటిని తరలించడానికి గతంలో చాలా సార్లు ప్రయత్నాలు జరిగాయి. ఏదో నామ్ కే వాస్తేగా కొన్నింటిని నగరానికి దూరంగా తరలించారు.
ఇప్పుడు తెరాస ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టింది. కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు అవతికి తరలించాని నిర్ణయించింది. రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్వయంగా ఈ విషయం చెప్పారు. శనివారం నగరంలో బల్క్ డ్రగ్ ఉత్పత్తిదారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు నగరం మధ్యలో ఉండటం మంచిది కాదన్నారు.
1068 కాలుష్యకారక పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు అవతలికి తరలిస్తామని తెలిపారు. ఆయా రంగాల వారీగా పరిశ్రమలను ఒకే చోట ఏర్పాటు చేసుకోవడం మంచిదని సూచించారు. ఫార్మా రంగానికి చెందిన పరిశ్రమలు ఒక చోట, మరో రంగానికి చెందిన పరిశ్రమలు మరో చోట ఉంటే మంచిదన్నారు. ఈ పరిశ్రమల వారికి ప్రభుత్వం తగిన సహాయం చేస్తుందని, పారిశ్రామిక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని చెప్పారు.
హైదరాబాదులో పారిశ్రామిక కాలుష్యం ఓ పెద్ద సమస్య. చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు నాశనం కావడానికి పారిశ్రామిక కాలుష్యమే కారణం. దీనిపై అనేక ఉద్యమాలు జరిగాయి. ఆందోళన జరిగినప్పుడు హడావుడి చేయడం ఆ తర్వాత ఆ సంగతి మర్చిపోవడం ప్రభుత్వాలకు అలవాటైంది. తెలంగాణలో, నగరంలో ఉన్న సమస్యలపై తెరాస అధినేతకు, మరికొందరు నేతలు తగిన అవగాహన ఉంది. అందుకే, నగరంలోని కాలుష్య కారక పరిశ్రమలను తరలించడానికి ఓ లక్ష్యం నిర్దేశించుకున్నారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి వీటిని ఔటర్ రింగ్ రోడ్డు అవతలికి తరలించబోతున్నారు. మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని స్పష్టంగానే చెప్పారు.