హైదరాబాద్: టీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నేతల వలసలను తెలంగాణ మంత్రి కేటీఆర్ సమర్థించుకున్నారు. రాజకీయపార్టీలలో చేరికలు సహజమని, ఎవరొచ్చినా తాము స్వాగతిస్తామని అన్నారు. ఇవాళ సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఆపరేషన్ ఆకర్ష్‌పై ప్రశ్నలడిగిన విలేకరులకు కేటీఆర్ ఎదురు ప్రశ్నలు వేశారు. ఆఫర్లు ఇచ్చి చేర్చుకుంటామన్న వార్తలను ఖండించారు. అవన్నీ ప్రతిపక్షాలు చేస్తున్న చిల్లర రాజకీయాలన్నారు. ఎవరైనా వచ్చి పార్టీలోకి చేరతామంటే వద్దంటామా అని విలేకరులను ప్రశ్నించారు. కేసీఆర్ బాగా చేస్తున్నాడనే ఉద్దేశ్యంతోనే చేరుతున్నట్లు చేరినవారే చెబుతున్నారని గుర్తు చేశారు. తమకు లేని బాధ మీకెందుకని మీడియాను ప్రశ్నించారు. ప్రలోభపెట్టటం వలనో, బెదిరించటం వలనో చేరటానికి – తమ పార్టీలో చేరేవారు చిన్నపిల్లలు కాదని అన్నారు. వారంతా దశాబ్దాలుగా రాజకీయాలలో ఉన్నారని, నాలుగైదు సార్లు ఎమ్మెల్యేలుగా చేసినవారని చెప్పారు. ఎవరూ చేయని పనేదో తామే చేస్తున్నట్లు ఎందుకు చూస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు.