హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో సాధించిన అద్భుత విజయంపై కేటీఆర్ స్పందించారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ చరిత్రను తిరగరాశామని చెప్పారు. హైదరాబాద్లో ఏనాడూ లేనంతగా మెజారిటీ సాధించి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టామని అన్నారు. దీనికి గానూ గ్రేటర్ ప్రజలకు శిరస్సువంచి అభివందనం చేస్తున్నానని చెప్పారు. ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని అన్నారు. టీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో సాధించిన విజయంతో తెలంగాణలో తిరుగులేని రాజకీయశక్తిగా మారిందని చెప్పారు. తమ పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గత నెలరోజులుగా అహోరాత్రాలూ శ్రమించారని అన్నారు. ఇది పరిపూర్ణమైన విజయమని కేటీఆర్ చెప్పారు. దీనితో పొంగిపోబోమని అన్నారు. సవాళ్ళు చేసినవారి గురించి విలేకరులు అడగగా, అది వారి విజ్ఞతకే వదిలేస్తానని కేటీఆర్ చెప్పారు.