హైదరాబాద్ లోని కూకట్ పల్లి అంటే అదొక మినీ ఆంద్రప్రదేశ్ అని చెప్పవచ్చును. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన అనేకమంది అక్కడ స్థిర నివాసం ఉంటున్నారు. నిన్న సాయంత్రం అక్కడ ఏర్పాటు చేసిన రెండు ఎన్నికల ప్రచారసభలో మంత్రి కె.టి.ఆర్. మాట్లాడుతూ “తెరాస అంటే తెలంగాణా రాష్ట్ర సమితి అని అందరికీ తెలుసు. కానీ మున్ముందు అది తెలుగు రాష్ట్ర సమితిగా మారే అవకాశం ఉంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా తెరాస విస్తరించవచ్చును. అదే జరిగితే నేను భీమవరం నుండి ఎన్నికలలో పోటీ చేస్తాను. ఎందుకంటే అక్కడ నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. మావాళ్ళు చాలా మంది తరచూ భీమవరం వెళ్లి వస్తుంటారు. అక్కడి ప్రజలు చాలా సహృదయులు. ముఖ్యంగా క్షత్రియులు (రాజులు) ఆతిధ్యం ఇవ్వడంలో వారికి వారే సాటి. మా వాళ్ళు వెళితే రొయ్యలు, పీతలతో చేసిన రకరకాల వంటకాలు కొసరి కొసరి వడ్డించి తినిపించి వారి ఆతిధ్యంతో కట్టిపడేస్తారు. మా ముఖ్యమంత్రి కేసీఆర్ అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి హాజరయినప్పుడు ఆంధ్రా ప్రజలు కరతాళ ధ్వనులతో ఆయనకి స్వాగతం పలకడం మేము ఎన్నటికీ మరిచిపోలేము. అది చూసి ఆంధ్రా మంత్రులే ఆశ్చర్యపోయారు,” అని అన్నారు.
తరువాత అసలు విషయంలోకి వస్తూ “త్వరలో జరుగబోయే జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో తెరాసకు ఒక అవకాశం ఇవ్వాలని మా ఆంధ్రా మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇన్ని దశాబ్దాలలో కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలు చేయలేని అభివృద్ధిని మేము చేసి చూపిస్తాము. నగరం అభివృద్ధి జరగకుండా అడుగడునా అడ్డుపడుతున్న ప్రతిపక్ష పార్టీలకు ఈ ఎన్నికలలో గట్టిగ బుద్ధి చెప్పి తెరాసను గెలిపించవలసిందిగా కోరుతున్నాను,” అని మంత్రి కె.టి.ఆర్. అక్కడి ఆంధ్ర ప్రజలను కోరారు.
బహుశః కేసీఆర్ కుటుంబ సభ్యులకి ఉన్న వాక్చాతుర్యం మరెవరికీ ఉండదేమో అనిపిస్తుంది మంత్రి కె.టి.ఆర్. మాటలు వింటే. ఒకప్పుడు హైదరాబాద్ జంట నగరాలలో స్థిరపడిన ఆంద్ర ప్రజలను భయబ్రాంతులను చేసి వారిలో తీవ్ర అభద్రతాభావం నెలకొనేలా చేసిన కేసీఆర్ ఆయన పార్టీ నేతలే ఇప్పుడు వారిని తమ మాటలతో కట్టిపడేస్తున్నారు. తీవ్ర ప్రతికూలతలో కూడా పరిస్థతిని తమకు అనుకూలంగా మార్చుకోగల నేర్పు వాళ్ళకే స్వంతం అనిపిస్తుంది. ఎక్కడ తగ్గితే నెగ్గగలమో బహుశః కేసీఆర్ కుటుంబసభ్యులకి తెలిసినట్లు మరెవరికీ తెలియదనిపిస్తుంది. ఒకప్పుడు జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో పోటీ చేయడానికే భయపడిన తెరాస నేతలు ఇప్పుడు ఒంటరిగా పోటీ చేసి గెలవగలమనే ఆత్మవిశ్వాసం వారి మాటలలో ప్రస్పుటంగా కనబడుతోంది.