హైదరాబాద్: తెలంగాణ పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఆంధ్రావాళ్ళ ఓట్లతోనే జీహెచ్ఎంసీ పీఠాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రావాళ్ళు సంక్రాంతికి ఊరెళ్ళొచ్చాకే జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. కేటీఆర్ ఇవాళ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఈ 18 నెలల్లో ఆంధ్రావారిపై ఈగ వాలనివ్వలేదని చెప్పారు. ఆంధ్రావాళ్ళను ఇక్కడనుంచి పంపించేస్తారని ప్రచారం చేశారని, హైదరాబాద్లో సీమాంధ్రవారిలో ఏ ఒక్కరికైనా నష్టం జరిగిందా అని అన్నారు. సంక్షేమ పథకాల అమల్లో పక్షపాతం చూపించలేదని, అన్నిప్రాంతాలవారినీ అక్కున చేర్చుకున్నామని చెప్పారు. విభజనవల్ల రెండు రాష్ట్రాలూ లబ్ది పొందాయని అన్నారు. ఏపీ ఏపీగానే ఉంటే అభివృద్ధి చెందేదా అని ప్రశ్నించారు. విడిపోవటం వల్ల ఏపీకి ఒక ఐఐటీ, ఒక అంతర్జాతీయ విమానాశ్రయం, ఎయిమ్స్ వచ్చాయని చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో పొత్తులుండవన్నారు. రిజర్వేషన్స్ ప్రకటన తర్వాత గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని కేటీఆర్ చెప్పారు.