ఏపీ నేతలపై జరుగుతున్న ఐటీ దాడులపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు! ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చూసి తెలంగాణలో భయపడేవాళ్లు ఎవ్వరూ లేరన్నారు. మోడీని బూచిగా చూపించి, తెలంగాణపై రుద్దే ప్రయత్నం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్నారంటూ విమర్శించారు. తెరాస నేతలపై కూడా ఐటీ దాడులు జరిగిన సందర్భాలున్నాయనీ, కానీ చంద్రబాబు పడుతున్నంతగా తామెప్పుడూ కంగారుపడలేదన్నారు. రేవంత్ రెడ్డి, సీఎం రమేష్ లపై ఐటీ దాడులు జరిగితే… ఏపీ సీఎం ఉలికి ఉలికి పడుతున్నారు అన్నారు.
తెరాస నేతలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, విజయరామారావు కుటుంబాలపై కూడా ఐటీ దాడులు జరిగాయన్నారు. ఆ సమయంలో తాము ఇంతగా స్పందించలేదన్నారు. కానీ, టీడీపీ నేతలపై ఐటీ దాడులు జరుగుతుంటే దాని గురించి కేబినెట్ సమావేశంలో కూడా మాట్లాడటం చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు కేటీఆర్. మోడీ అంటే చంద్రబాబు నాయుడుకి భయం ఉండొచ్చేమోగానీ, తమకు అలాంటిదేదీ లేదన్నారు.
నిజమే, మోడీని చూసి భయపడాల్సిన అవసరం తెరాసకు ఏమాత్రమూ లేదు! కానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చూసి కేటీఆర్ ఆశ్చర్యపడాల్సినంత అవసరమూ అంతకన్నా లేదు! ఎందుకంటే, కేంద్రంలో మోడీ సర్కారుతో కేసీఆర్ కి ఉన్న అనుబంధం వేరు… చంద్రబాబు సర్కారుకి ఉన్న అనుభవం వేరు! విభజన తరువాత ఆంధ్రా అన్ని విధాలుగా నష్టపోయింది. ఇస్తామన్న హోదా ఇవ్వలేదు, రైల్వే జోను, కడప ఉక్కు ఫ్యాక్టరీ, రెవెన్యూ లోటు భర్తీ… ఇలా కేంద్రం చేయాల్సినవేవీ చెయ్యలేదు. కాబట్టి, ఎన్డీయేతో తెగతెంపులు చేసుకుని కేంద్రంపై ఎదురుతిరగాల్సిన పరిస్థితి చంద్రబాబుకు ఎదురైంది. ఇలాంటి అనుభవం తెరాసకుగానీ, కేటీఆర్ కి గానీ ఎక్కడుంది..?
భాజపాతో స్నేహం తెగిన దగ్గర్నుంచీ రాజకీయ కక్ష సాధింపు చర్యల కోసం భాజపా ప్రయత్నిస్తోందన్నది ఆ పార్టీ నేతలే చాలాసార్లు చెబుతూ వచ్చారు. ప్రపంచంలో ఎక్కడా జరగని అవినీతి ఆంధ్రాలో జరుగుతోందనీ, చంద్రబాబుపై కేసులు తప్పవనీ, ఆయన బోనులో నిలబెట్టే వరకూ నిద్ర ఉండదనీ… ఇలాంటి ప్రకటనలు భాజపా నేతలు చేస్తున్నారు కదా! ఇలాంటి అనుభవం కేంద్రంతో తెరాసగానీ, కేటీఆర్ కి గాని ఎక్కడుంది..? కేంద్రం నుంచి ఎలాంటి చర్యలు ఉన్నా… దానిపై ఉలిక్కి పడాల్సిన పరిస్థితి, అప్రమత్తంగా ఉండాల్సిన అవస్థకు ఆంధ్రాకు వచ్చింది. రాష్ట్ర ప్రయోజనాలను కాలరాసే కుయుక్తులతో జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాలను ఖండించాల్సింది పోయి, చంద్రబాబు వణికిపోతున్నారూ… మాకు అలాంటి భయం లేదంటూ కేటీఆర్ స్పందిస్తే ఏమనుకోవాలి… అనుభవ రాహిత్యం తప్ప?