బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తే సీఎం అయ్యేవాడిని.. రేవంత్ తన కలను కల్లలు చేశాడనే ఆగ్రహమో ఏమో కానీ రేవంత్ రెడ్డిపై కేటీఆర్ కసితీరా కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి అయ్యాకనైనా లాంగ్వేజ్ మార్చుకోవాలని , హుందాగా మాట్లాడాలని ఉచిత సలహాలు ఇస్తూనే రేవంత్ పై కేటీఆర్ మాట్లాడుతున్న భాష కాంగ్రెస్ శ్రేణులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి.
కేసీఆర్ హయాంలో రేవంత్ వాడిన భాషపై కేటీఆర్ అండ్ కోటరీ పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేసింది. కేసీఆర్ అంటే ఎంత కక్ష ఉన్నా..ఆయన సీఎం అని మర్యాదగా మాట్లాడాలని ఎన్నోసార్లు చెప్పింది. కానీ, పాలన పగ్గాలు కేసీఆర్ నుంచి రేవంత్ కు చేరగానే గతంలో బీఆర్ఎస్ నేతల సుద్దులు గాలికి ఎగిరిపోయాయి. రేవంత్ పై అదేపనిగా కేటీఆర్ విమర్శల దాడి కొనసాగిస్తున్నారు.
గత అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ పట్ల అమర్యాదగా మాట్లాడిన కేటీఆర్ ఆ తర్వాత కూడా అదే టెంపో కొనసాగిస్తున్నారు. కేటీఆర్ చేస్తోన్న విమర్శల దాడి చూస్తుంటే..రేవంత్ ను కేటీఆర్ సీఎంగా గుర్తించడానికి ఇష్టపడటం లేదని స్పష్టం అవుతోంది. అదే ఆయన అభిప్రాయం అయితే ప్రజాభిప్రాయాన్ని కేటీఆర్ సవాల్ చేసినట్లే అవుతుంది అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
కాగా.. మూసీ సుందరీకరణ వివాదంపై కేటీఆర్ స్పందిస్తూ..నీ తాట తీయడానికే వచ్చా అంటూ రేవంత్ నుద్దేశించి ట్వీట్ చేయడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హుందాగా మాట్లాడాలంటూ ..ముఖ్యమంత్రి గురించి ఓ వీధి రౌడీలా మాట్లాడతారా అంటూ కేటీఆర్ పై మండిపడుతున్నారు. మందిది మంగళవారం..మనది సోమవారం అనే తరహాలో కేటీఆర్ కామెంట్స్ ఉన్నాయని అంటున్నారు.