తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్ని విషయాల్లోనూ చురుగ్గా ఉంటారు. అటు ప్రభుత్వంలో యాక్టింగ్ సీఎంగా ఉంటారు. అన్ని శాఖల్లోనూ ఆయన చొరవ తీసుకుంటూ ప్రకటనలు..నిర్ణయాలు ప్రకటిస్తూ ఉంటారు. పార్టీలోనూ అంతే. ఆయన అక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్. అందుకే అన్ని విషయాల్లోనూ ఆయన జోక్యం ఉంటుంది. కానీ ఎందుకనో కానీ.. ఒక్క విషయంలో మాత్రం.. ఆయన సైలెన్స్ పాటిస్తున్నారు. ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడం లేదు. ఆ విషయమే.. ఈటల రాజేందర్ ఇష్యూ. ఈటల రాజేందర్ అంశం .. తెలంగాణ రాష్ట్ర సమితిలో కలకలం రేపుతోంది. ఆయనపై భూకబ్జా ఆరోపణలు ప్రారంభించిన దగ్గర్నుంచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే వరకూ.. చాలా చాలా ఆరోపణలు చేశారు.
అయితే.. ఏ ఒక్క సారి కూడా ఆయన స్పందించలేదు. నిజానికి మొదటి సారి ఈటల ఇష్యూ బయటకు వచ్చినప్పుడు కేటీఆర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆయన మొదట హోమ్ ఐసోలేషన్‌లో తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొంది వచ్చారు. ఆ సమయంలో తన ట్విట్టర్ ఖాతాను కూడా.. సైలెంట్ మోడ్‌లోనే ఉంచారు కేటీఆర్. కోలుకుని మళ్లీ అధికార విధుల్లోకి వచ్చిన తర్వాత కూడా ఈటల అంశంపై స్పందించడం లేదు. ఇప్పుడు ఈటల ఇష్యూ క్లైమాక్స్ కూడా అయిపోయింది.
ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. సోమవారం బీజేపీలో చేరుతున్నారు. అయినా కేసీఆర్ సైలెన్స్‌గానే ఉన్నారు. ఇదంతా.. కేసీఆర్ వ్యూహమని.. ఈ వివాదంలోకి అసలు కేటీఆర్ అనే పేరు రాకుండా చూడాలని ఆయన అనుకున్నారు. ఒక వేళ అలా వస్తే.. కుమారుడి కోసమే ఈటలను పంపేసతున్నారన్న ప్రచారం జరుగుతుందని.. అలా జరగకూడదన్న ఉద్దేశంతోనే వ్యూహాత్మకంగా కేటీఆర్‌తో ఈటల అంశంపై మాట్లాడించడం లేదని అంటున్నారు.