తెలంగాణ మంత్రి కేటీఆర్.. కోవిడ్ టాస్క్ ఫోర్స్‌కు చైర్మన్ అయిన తర్వాత ఎలాంటి సమస్య వచ్చినా చురుగ్గా కదులుతున్నారు. తాజాగా సమ్మెకు వెళ్తామని ప్రకటించిన జూనియర్ డాక్టర్లను ఆయన శాంత పరిచారు. కొద్ది రోజులుగా జూనియర్ డాక్టర్లు తమకు గతంలో ఇచ్చిన హామీలనుప పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే సమ్మెకు వెళ్తామని గాంధీ ఆస్పత్రి లాంటి చోట్ల మెరుపు సమ్మెలు చేస్తున్నారు. అలాగే.. ఈ విషయమై జూనియర్ డాక్టర్లు ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ ను కోరారు. గతంలో జూనియర్ డాక్టర్లు చేసిన సమ్మెలు కలకలం రేపాయి.
అలాగే ఇలాంటి క్లిష్ట సమయంలో వారు విధులను బహిష్కరిస్తే.. సమస్యలు వస్తాయి. దీంతో కేటీఆర్ చురుగ్గా స్పందించారు. సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. హౌస్ సర్జన్, పీజీల స్టైఫండ్ 15 శాతం పెంచాలని కేసీఆర్ హెల్త్ సెక్రటరీకి మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారమే ఈ విషయమై జీవోను విడుదల చేయనున్నట్టుగా మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
గత ఏడాది కరోనా సమయంలో కూడ జూనియర్ డాక్టర్లు కూడ తమ డిమాండ్ల విషయమై నిరసనకు దిగారు. వారి సమస్యలను ఇప్పటికి పరిష్కరించారు. యాక్టింగ్ సీఎంగా అన్నీ తానై వ్యవహరిస్తున్న కేటీఆర్.. ఈ క్లిష్ట సమయంలో.. జూనియర్ డాక్టర్ల సమస్య హెడ్ లైన్స్‌కు ఎక్కకుండా సమస్యకు పరిష్కారం కనుగొన్నారు.