కేటీఆర్ కొత్త కొత్త ఐడియాలతో తెరపైకి వస్తున్నారు. ఈడీ ఎదుట విచారణకు హాజరై బయటకు వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై పెట్టిన ఫార్ములా ఈ రేసు కేసుల దర్యాప్తు కోసం పది కోట్లు ఖర్చవుతాయని పేపర్లో చదివానని అంత డబ్బుతో ఏదైనా పథకాలు అమలు చేయవచ్చన్నారు. రేవంత్ రెడ్డి మీద ఏసీబీ, ఈడీ కేసులు ఉన్నాయి కాబట్టి నా మీద కేసులు పెడుతున్నారు. కోట్లు పెట్టి దర్యాప్తు చేయించడం ఎందుకని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ముందుకు వస్తే జడ్జి ముందు కూర్చుందాం. లై డిటెక్టర్ పరీక్ష చేయించుకుందాం.. మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేసి తప్పెవరిదో తేల్చుకుందామని సవాల్ చేశారు.
కేటీఆర్ ప్రకటన చూసి అందరూ ఆశ్చర్యపోయారు. దేశంలో చట్టాలు చాలా స్లోగా ఉంటాయని.. విచారణ ఎప్పటికీ తెమలదని అనుకుంటారు కానీ.. కేటీఆర్ చెప్పిన ఇడియాతో అయితే ఇన్ స్టంట్ గా రెండు, మూడు రోజుల్లో కేసులు తేలిపోతాయి. అయితే ఇలాంటివి మన చట్టాలు అంగీకరించవు. చట్టం, రాజ్యాంగం ప్రకారం.. దర్యాప్తులు జరుగుతాయి. అయినా ఇక్కడ కేసులు ఉన్నది.. రేవంత్ తప్పు చేశాడా.. కేటీఆర్ తప్పు చేశాడా అన్నది కాదు. ఎవరి కేసులు వాళ్లవే. ఈ లాజిక్ కేటీఆర్ మిస్సయ్యారు. అయినా ఈడీ కేసులు కూడా రేవంత్ రెడ్డి పెట్టిస్తున్నారని.. ఆయనే దర్యాప్తు చేయిస్తున్నారని అనుకుంటే.. రేవంత్ కు చాలా పెద్ద ఎలివేషన్ ఇచ్చినట్లే. అయినా కేటీఆర్ ఇస్తున్నారు.
ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్‌ను ఈడీ అధికారులు ఏడు గంటల పాటు ప్రశ్నించారు. ఉదయం పదిన్నరకు ఈడీ ఆఫీసుకు వెళ్లిన ఆయన సాయంత్రం ఆరు గంటల సమయంలో బయటకు వచ్చారు. ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలే ఈడీ అధికారులు అడిగారని చెప్పుకొచ్చారు. తాను తప్పు చేయలేదని.. ఎన్ని సార్లు విచారణకు పిలిచినా వస్తానని చెప్పానన్నారు. దర్యాప్తు సంస్థలు ఎన్ని సార్లు పిలిచినా వెళ్లాల్సిందే. వస్తానని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.