కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేయాలని నిర్ణయించడం.. అక్కడ్నుంచి రేవంత్ రెడ్డి కూడా రంగంలోకి దిగే చాన్స్ ఉండటంతో పరిస్థితి క్రమంగా మారుతోంది. దీంతో కేటీఆర్ ఆ నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్పై తీవ్ర వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణాల్లో ఒకటి మాస్టర్ ప్లాన్. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదాను గతంలో ఆమోదించారు. ఇది రైతుల్ని తీవ్రంగా నష్టపరిచేలా ఉండటంతో పెద్ద ఉద్యమం జరిగింది.
ఇద్దరు ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ మాస్టర్ ప్లాన్ చాలా మంచిదని.. మార్చే ప్రసక్తే లేదని అప్పట్లో కేటీఆర్ చెప్పేవారు. కానీ ఉద్యమం తీవ్రమయ్యే సరికి చివరికి రద్దు చేస్తామన్నారు. మున్సిపాలిటీలో తీర్మానం చేశారు కానీ.. మున్సిపల్ శాఖ నుంచి ఎలాంటి ఉత్తర్వులు విడుదల కాలేదు. ఇప్పుడు హఠాత్తుగా కేటీఆర్ ఉద్యమ జేఏసీ నేతల్ని ప్రగతి భవన్ పిలిపించుకుని వారి ముందే అధికారులకు ఫోన్ చేసి.. మాస్టర్ ప్లాన్ రద్దు ఉత్తర్వులు విడుదల చేయాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఉద్యమం సందర్భంగా పలువురు రైతులు, రైతు సంఘాల నాయకులపై కేసులు నమోదయ్యాయని వాటిని కూడా తీయించేస్తానని కేటీఆర్ భరోసా ఇచ్చారు. వారి ముందే పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇవన్నీ రైతులకు సంతృప్తినిచ్చాయి . కేటీఆర్ పోటీ సందర్భంగా ఇలాంటి సమస్యల్ని పరిష్కరించడానికి కేటీఆర్ ప్రాధాన్యం ఇస్తున్నారు.