టీఆర్ఎస్ హుజూర్ నగర్ నియోజకవర్గంలో భారీగా పార్టీ బలగాలను రంగంలోనికి దింపింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పోరేషన్ చైర్మన్లను మండలాలు గ్రామాల వారీగా మోహరించి ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ముఖ్యంగా వివిధ సామాజిక వర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆయా సామాజిక వర్గాల నేతలనే ఇంచార్జీలుగా నియమించింది. గ్రామాలను నేతలు చుట్టేస్తున్నారు. ఇంతలా ప్రచారం నిర్వహిస్తున్నా.. టీఆర్ఎస్ కు నియోజక వర్గంలో ఇంకా అనుకున్నంత మైలేజీ రావడం లేదని చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్ది సైదిరెడ్డిపై సొంత పార్టీలోనే ఉన్న వ్యతిరేకత ఇబ్బందికరంగా మారిందనే చర్చ ఆ పార్టీలోనే నడుస్తోంది.
పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పడికప్పుడు హుజూర్ నగర్ ఎన్నికపై ఇంచార్జీలతో క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకుంటున్నారు. ఇప్పటికే కేటీఆర్ ఓ సారి రోడ్ షో నిర్వహించి క్యాడర్లో ఉత్సహాం నింపే ప్రయత్నం చేశారు. అయితే కేటీఆర్ టూర్ తర్వాత పరిస్థితుల్లో ఏ మార్పు రాలేదని గ్రహించిన అధినేత స్థానిక నేతలతోనే ప్రచారం ముమ్మరంగా నిర్వహించాలని అదేశించినట్టు తెలుస్తోంది. అందుకే షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన కేటీఆర్ రోడ్డు షోలు రద్దయ్యాయనే చర్చ గులాబి పార్టీలో జరుగుతోంది. ఆర్టీసీ సమ్మె ప్రభావం కూడా హుజూర్ నగర్ పై పడినట్లు కన్పిస్తోంది. అటు ఆర్టీసీ సమ్మె ప్రభావం సీపీఐ పై పడింది. దీంతో టీఆర్ఎస్ కు హుజుర్ నగర్ మద్దతు ప్రకటించిన సీపీఐ ఇప్పుడు పురనరాలోచనలో పడింది.
ఈనెల 17 లేదా 18 తేదీల్లో కేసీఆర్ బహిరంగ సభ ఉంటుందని నేతలు చెప్పినా ప్రస్తుత పరిస్థితుల్లో సభ నిర్వహణపై కేసీఆర్ సుముఖంగా లేనట్టు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఓ వైపు వ్యతిరేకత..మరో వైపు నియోజక వర్గంలో ఉత్తమ్‌కు ఉన్న పట్టు కారణంగా అధికార టీఆర్ఎస్ కు కత్తిమీద సాములా ఈ ఎన్నిక మారింది . ఈ ఎన్నికల్లో గెలవడం కోసం టీఆర్ఎస్ నేతలు చెమటోడ్చాల్సిన పరిస్థితి ఎదురౌతోంది. ఇప్పటికే ఆశలు వదిలేసుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.