రేవంత్ సర్కార్ 2 లక్షల రుణమాఫీని ప్రారంభించడంతో తెలంగాణ రైతాంగమంతా సంబరపడిపోతోంది. ఏకకాలంలో రుణమాఫీ అవుతుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వాన్ని ఎలా కౌంటర్ చేయాలో బీఆర్ఎస్ కి ఇంకా అర్థం కావడం లేదు. ఆల్రెడీ రాజీనామా సవాల్ నుంచి హరీష్ రావు సైలెంట్ గా డ్రాప్ అయిపోగా కేటీఆర్ మాత్రం ఇంకా ఏదో చేయాలనుకుంటున్నారు. ఇన్నాళ్లు బీఆర్ఎస్ కు అండగా ఉన్న రైతులు కాంగ్రెస్ వైపు టర్న్ అవుతుండటంతో కోడి గుడ్డు మీద ఈకలు పీకే పని మొదలు పెట్టారు.
రైతు భరోసా సొమ్మునే రైతు రూణమాఫీగా చేస్తున్నారని గురువారం ఆరోపణలు చేసిన కేటీఆర్.. తాజాగా “చారాణ కోడికి..! బారాణ మసాలా…!! ” అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. అయినా..కేటీఆర్ ఆరోపణలు పెద్దగా రైతుల్లోకి వెళ్లడం లేదు. ఎందుకంటే రైతుల్లో ఒకేసారి రైతు రుణమాఫీ కావాలని, రైతు భరోసా రావాలని అత్యాశ ఏమీ లేదు.. ముందుగా రైతు రుణమాఫీ జరిగితే బాగుండు అని చాలామంది అనుకుంటున్నారు.. కానీ కేటీఆర్ మాత్రం రైతు భరోసా అంశాన్ని ముందు పెట్టి చేసిన రాజకీయం ఫెయిల్ అయింది.
దీంతో ప్లాన్ మార్చిన కేటీఆర్.. చేస్తున్నది తక్కువ.. ప్రచారం ఎక్కువ అంటూ ఎక్స్ లో పోస్ట్ చేయడం ఆ పార్టీనే వేలెత్తి చూపిస్తోంది. బీఆర్ఎస్ గతంలో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి.. విడతల వారీగా కొంతమందికే చేసింది. అందులోనూ కొర్రీలు పెట్టింది. ఇప్పడు రేవంత్ సర్కార్ ఏకకాలంలో రెండు లక్షల రుణాలను మాఫీ చేస్తున్నా.. దానిని కేటీఆర్ సులువుగా కొట్టిపారేయడంపై రైతాంగం నుంచే విమర్శలు వస్తున్నాయి. మీరు చేయలేనిది కాంగ్రెస్ సర్కార్ చేస్తున్నదుకే ఈ విమర్శలా అంటూ కౌంటర్ ఇస్తున్నారు.