తెలంగాణ ప్రభుత్వంపైన ముఖ్యమంత్రి కెసిఆర్‌పైన కాంగ్రెస్ నాయకులు జైరాం రమేష్ చేసిన ఆరోపణలకు మంత్రి కెటిఆర్ ఘాటుగానే సమాధానమిచ్చారు. ఏకకాలంలో వెంకయ్య నాయుడుకు కెసిఆర్‌కు వర్తించే ఈ ఆరోపణలపై కెటిఆర్ ఆధారాలతోనే మాట్లాడారు. అయితే ఆయన వాదనల సారాంశం చూస్తే జైరాం చెప్పింది ఖండించడం కన్నా పూర్వాపరాలు వివరించడమే ఎక్కువగా జరిగింది. ఉదాహరణకు వెంకయ్య కుమార్తె దీపా వెంకట్ స్వర్ణభారత్ ట్రస్టుకు 2 కోట్ల ఆస్తి పన్ను మినహాయింపు నిజమే గాని అలాటివి గతంలోనే అనేకం జరిగాయని జాబితా ఇచ్చారు. పోలీసు శాఖకు టయోటా వాహనాలు కొన్న మాట నిజమే గాని అవి యుపిఎ ప్రభుత్వం నిర్ణయించిన డిజిఎస్ఎన్డి అనే రేటు ప్రకారమే కొన్నామన్నారు. అది కూడా కంపెనీతో నేరుగా మాట్లాడి తెప్పించామన్నారు. అయితే స్థానికంగా డీలర్‌గా వున్న వెంకయ్య నాయుడు కుమారుడి హర్ష టయోటా ద్వారా అవి వచ్చిన మాట మాత్రం కాదనలేదు. ఇక కాంగ్రెస్ నాయకులవి చిల్లర మాటలు లేకి మాటలు వంటి పదాలతో తీవ్రంగా దాడి చేశారు. తనకు ఏడేళ్ల కిందట ఒక స్పేర్ పార్ట్స్ దుకాణం వున్న మాట నిజమే గాని ఇప్పుడు లేదని కావాలంటే జైరాంకు రాసిస్తానని కూడా ఎకసెక్కం చేశారు. మొత్తంపైన కాంగ్రెస్ నాయకులకు గట్టి సమాధానం ఇవ్వాలన్న టిఆర్ఎస్ శ్రేణులకు కెటిఆర్ వ్యాఖ్యలు బాగా ఉపయోగపడతాయి.