కేటీఆర్ ప్రచార శైలి మారిపోయింది. కేసీఆర్, హరీష్ రావు బహిరంగసభలకు ప్రాధాన్యం ఇస్తూండగా కేటీఆర్ మాత్రం వివిధ వర్గాలతో ముఖాముఖి సమావేశం అయ్యేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రభుత్వంపై అసంతృప్తి ఉందని భావిస్తున్న వివిధ వర్గాల్లో ఉన్న అనుమానాలను నివృతి చేసేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు.
మొదట నిరుద్యోగ వర్గాలతో సమావేశం అయ్యారు. ఆ వీడియోకు విస్తృత ప్రచారం కల్పించుకున్నారు. మెట్రోరైల్లో రాయదుర్గం నుంచి బేగంపేట వరకూ ప్రయాణించారు. ఐటీ ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు, యువతీ యువకులతో ఆయన మాటా మంతీ జరిపారు. ఆటో యూనియన్ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇలా అన్ని రకాలుగా వివిధ వర్గాలతో సమావేశం అవుతున్నారు. బహిరంగసభలను .. నియోజకవర్గాల పర్యటనలను తగ్గించుకున్నారు.
ఏ వర్గంలో అసంతృప్తి ఉందని భావిస్తున్నారో వారితో ప్రత్యేక భేటీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో కారుకు ప్రతికూల పరిస్థితులు ఎదురు కాబోతున్నాయని భావిస్తున్నందున.. ముఖ్యంగా ప్రజల్లో మార్పు అనే ఆలోచన ఉందన్న అభిప్రాయం వినిపిస్తూండటంతో రిస్క్ వద్దన్న అభిప్రాయాన్ని కల్పిస్తున్నారు. కేఫ్‌ల్లో సరాదాగా గడపటం, బిర్యానీ సెంటర్లలో యువతతో మాట్లాడటం వంటివి చేస్తున్నారు.