తెలంగాణ రాష్ట్ర సమితి బీజేపీపై దూకుడుగా ఉన్న సమయంలో దక్షిణాది వాదం వినిపించేవారు. దక్షిణాది నుంచి పెద్ద ఎత్తున పన్నుల ఆదాయం పొందుతున్న కేంద్రం.. వాటిని మొత్తం ఉత్తరాదిలో ఖర్చు పెడుతోందని ఆరోపించేవారు. గ్రేటర్ ఎన్నికల తర్వాత వాటిని పూర్తిగా మానుకున్నారు. అయితే హఠాత్తుగా ఇప్పుడు… కేటీఆర్ మళ్లీ దక్షిణాది వాదం వినిపించారు. తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పూర్తిగా బీజేపీని టార్గెట్ చేశారు. బుల్లెట్ ట్రైన్, హై స్పీడ్ ప్రాజెక్టులన్నీ గుజరాత్, ఢిల్లీ, ముంబై ప్రాంతాలకే పరిమితమవుతాయి కానీ హైదరాబాద్‌ను మాత్రం పట్టించుకోరన్నారు.
అంతే కాదు కేంద్రం తీసుకొచ్చిన ఆత్మనిర్భర్ ప్యాకేజీపైనా స్పందించారు. దాని లాభం కలిగిందని ఒక్కరూ చెప్పడం లేదన్నారు. తెలంగాణకు ప్రాజెక్టులు, పరిశ్రమలను కేటాయించాలని ఎన్నోసార్లు కేంద్రానికి లేఖలు రాసినా స్పందన లేదన్నారు. 80 సీట్లు ఉంటే రాజ్యమేలుదామని అనుకుంటున్నారని .. 17 సీట్లు ఉన్నాయి కాబట్టి సరిపోయిందన్నారు. అంటే దక్షిణాది మొత్తం పదిహేడు లోక్‌సభ సీట్లు బీజేపీకి ఉన్న విషయాన్ని గుర్తు చేశారన్నమాట. కేటీఆర్ దక్షిణాది వాదాన్ని తెరపైకి తీసుకు రావడం వెంటనే వైరల్ అయింది. కిషన్ రెడ్డికూడా స్పందించారు.
అనవసర రాజకీయం చేయకపోతేనే తెలంగాణకు మంచిదని సలహా ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలు.. పరిస్థితులు ప్రకారం.. బీజేపీతో వీలైనంత సామరస్యంగా ఉండాలన్న స్ట్రాటజీని కేసీఆర్ పాటిస్తున్నారు. బీజేపీ కూడా…గ్రేటర్ ఎన్నికల నాటి దూకుడు చూపించడం లేదు. అయితే.. ఇద్దరిదీ అవసరమేనని.. అవకాశం వచ్చినప్పుడు ఇద్దరూ కత్తులు దూసుకోవడానికి రెడీనని.. కేటీఆర్ వ్యాఖ్యలు… కిషన్ రెడ్డి రిప్లయ్‌తో తేలిపోయిందన్న చర్చ జరుగుతోంది.