తెలంగాణ ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఫ్రాన్స్ పారిశ్రామికవేత్తల్ని ఆకట్టుకుంటున్నారు. ప్రెంచ్ సెనెట్‌లో జరిగిన యాంబిషన్ ఇండియా పోగ్రాంలో ప్రసంగించేందుకు తనకు వచ్చిన అవకాశాన్ని కేటీఆర్ తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధి కోసం వ్యూహాత్మకంగా ఉపయోగించుకుంటున్నారు. ప్రతిభావంతులైన అధికార బృందంతో వెళ్లిన కేటీఆర్.. ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. యాంబిషన్ ఇండియా సదస్సులో ఆయన ప్రసంగం కూడా తెలంగాణ లో పెట్టుబడుల అనుకూల వాతావరణం చుట్టూనే తిరిగింది. బ్రాండ్ తెలంగాణను ప్రమోట్ చేయడంలో కేటీఆర్ సక్సెస్ అయ్యారు.
” మూవ్మెంట్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ ఆఫ్ ఫ్రాన్స్” తో కేటీఆర్ అర్థవంతమైన చర్చలు జరిపారు. ఇది ఇండియాలో సీఐఐలాంటి సంఘం. ఫ్రాన్స్‌లో 95శాతం కన్నా ఎక్కువ వ్యాపార సంస్థలు, పారిశ్రామిక సమూహాలు ఇందులో భాగంగా ఉన్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ , ఫార్మా రంగాలకు తెలంగాణ ఎలా డెస్టినేషన్ గా మారిందో వివరించారు. అలాగే ఓ రైల్వే షెడ్‌గా ఉన్న భవనాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ క్యాంపస్ గా మార్చిన వైనాన్ని కేటీఆర్ పరిశీలించారు. స్టేషన్ ఎఫ్‌గా ప్రసిద్ధి పొందిన అ క్యాంపస్ నిర్వాహకులతో టీ హబ్, వుయ్ హబ్, టీ వర్క్స్, తెలంగాణ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ సంస్థలతో కలిసి పని చేసే అంశంపై చర్చించారు. 1,000 స్టార్టప్‌లు స్టేషన్ ఎఫ్ నుంచి వచ్చాయి.
రాజకీయంగా ఎలాంటి విమర్శలు ఎదుర్కొంటున్నా.. తెలంగాణకు రావాల్సిన పెట్టుబడుల విషయంలో చిన్న నిర్లక్ష్యాన్ని కూడా కేటీఆర్ ప్రదర్శించడం లేదు. ఎక్కడా శషభిషలకు పోవడం లేదు. ఓ సారి తెలంగాణ పర్యటనకు వచ్చిన ఓ ఐటీ కంపెనీ సీఈవోకి వర్షం వస్తూంటే గొడుగు పట్టారు. అది కేటీఆర్ పెట్టుబడుల ఆకర్షణ ఇమేజ్ను మరింతగా పెంచింది. ఆ ప్రతిఫలం తెలంగాణకు పెట్టుబడుల రూపంలో లభించే అవకాశం ఉంది.